LOADING...
Padmanabhaswamy Temple: పద్మనాభస్వామి ఆలయంలో వస్తువుల మాయంపై ఆరోపణలు.. విచారణకు ప్రభుత్వం సిద్ధం
పద్మనాభస్వామి ఆలయంలో వస్తువుల మాయంపై ఆరోపణలు.. విచారణకు ప్రభుత్వం సిద్ధం

Padmanabhaswamy Temple: పద్మనాభస్వామి ఆలయంలో వస్తువుల మాయంపై ఆరోపణలు.. విచారణకు ప్రభుత్వం సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలో విలువైన వస్తువులు అదృశ్యమయ్యాయని వచ్చిన ఆరోపణలు, అలాగే భద్రతా లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కె. మురళీధరన్‌ శనివారం వెల్లడించారు. ఈ ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని, ఆలయ ఆస్తుల విషయంలో ఎవరి జోక్యానికీ అవకాశం ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు. ఆలయ పరిపాలన కమిటీ నుంచి ఇప్పటికే నివేదికను స్వీకరించినట్లు తెలిపారు. హోం మంత్రిత్వశాఖతో చర్చించిన తర్వాత విచారణపై అధికారిక ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో శబరిమల ఆలయంలో బంగారం అవకతవకలపై జరుగుతున్న సిట్‌ విచారణపై ప్రభుత్వం సంతృప్తిగా లేదని మురళీధరన్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు

ఆరోపణలను పూర్తిగా ఖండించిన ఆలయ కమిటీ

అయితే హైకోర్టు స్వయంగా సిట్‌ను నియమించినందున దానిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని ఆయన తెలిపారు. మరోవైపు ఆరోపణలను ఆలయ కమిటీ పూర్తిగా ఖండించింది. పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాల నగతో సహా విలువైన వస్తువులన్నీ భద్రంగా ఉన్నాయని, నిబంధనల ప్రకారం క్రమం తప్పకుండా ఆడిటింగ్‌ జరుగుతోందని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) స్పష్టం చేసింది. వస్తువుల అదృశ్యంపై వచ్చిన ఆరోపణలు ఆధారహీనమని కమిటీ పేర్కొంది. ఆలయ పరిధిలోని ఆస్తులు, ఖరీదైన వస్తువులు, ఇతర లావాదేవీల విలువను లెక్కగట్టి వాటి వివరాలను డిజిటల్‌గా భద్రపరచనున్నట్లు టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్‌ శనివారం వెల్లడించారు.

వివరాలు

పోలీసుల నివేదిక ఏకపక్షంగా ఉంది

ఇక ట్రావెన్‌కోర్‌ రాజ కుటుంబం కూడా పద్మనాభస్వామి ఆలయంలో వస్తువుల అదృశ్యం ఆరోపణలను ఖండించింది. పోలీసుల నివేదిక ఏకపక్షంగా ఉందని కుటుంబ సభ్యుడు ఆదిత్య వర్మ విమర్శించారు. తాము వ్యక్తిగతంగా తనిఖీ చేసినప్పుడు, అదృశ్యమయ్యాయని చెప్పిన వస్తువులు గర్భగుడి వద్ద సురక్షితంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

Advertisement