LOADING...
BJP: రాజకీయ పార్టీలకు నిధుల కేటాయింపు.. అగ్రస్థానంలో బీజేపీ.. కాంగ్రెస్ స్థానం ఎంతంటే?
రాజకీయ పార్టీలకు నిధుల కేటాయింపు.. అగ్రస్థానంలో బీజేపీ.. కాంగ్రెస్ స్థానం ఎంతంటే?

BJP: రాజకీయ పార్టీలకు నిధుల కేటాయింపు.. అగ్రస్థానంలో బీజేపీ.. కాంగ్రెస్ స్థానం ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు చేరిన విరాళాల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సింహభాగం లభించింది. మొత్తం పంపిణీ చేసిన నిధుల్లో 82.52 శాతం వాటాను కమలం పార్టీ పొందగా, ఇతర పార్టీలు చాలా వెనుకబడ్డాయి. ఈ విషయాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ఏడీఆర్ వివరాల ప్రకారం, 2024-25లో ఎలక్టోరల్ ట్రస్టులు కలిపి రూ. 3,826.35 కోట్లను వివిధ రాజకీయ పార్టీలకు పంపిణీ చేశాయి. ఇందులో బీజేపీ ఒక్కదానికే రూ. 3,157.65 కోట్లు అందాయి.

Details

కాంగ్రెస్ కు 298.78 కోట్లు

ప్రధాన ప్రతిపక్షమైన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి రూ. 298.78 కోట్లు (7.81 శాతం) మాత్రమే లభించగా, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌కు రూ. 102 కోట్లు (2.67 శాతం) అందాయి. మిగిలిన 19 రాజకీయ పార్టీలకు కలిపి రూ. 267.92 కోట్లు మాత్రమే దక్కాయి. విరాళాలు అందించిన కార్పొరేట్ సంస్థల్లో ఎలివేటెడ్ అవెన్యూ రియాల్టీ LLP రూ. 500 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తదుపరి స్థానాల్లో టాటా సన్స్ (రూ. 308 కోట్లు), టాటా కన్సెల్టటీ సర్వీసస్- టీసీఎస్ (రూ. 217 కోట్లు), మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (రూ. 175 కోట్లు) ఉన్నాయి. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, మహారాష్ట్ర నుంచి అత్యధికంగా రూ. 1,225 కోట్లు విరాళాలుగా వచ్చాయి.

Details

పది ట్రస్టుల నుంచే విరాళాలు

తెలంగాణ నుంచి రూ. 358 కోట్లు అందడం గమనార్హం. దేశవ్యాప్తంగా 20 రిజిస్టర్డ్ ఎలక్టోరల్ ట్రస్టులు ఉన్నప్పటికీ, కేవలం 10 ట్రస్టులు మాత్రమే తమ విరాళాల వివరాలను సమర్పించాయి. మరో 5 ట్రస్టులు తమకు ఎలాంటి విరాళాలు రాలేదని వెల్లడించగా, మిగిలిన 5 ట్రస్టుల నివేదికల గడువు ముగిసినా, అవి ఇంకా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవని ఏడీఆర్ తన విశ్లేషణలో పేర్కొంది. ఈ లెక్కలు బయటకు వస్తే మొత్తం విరాళాల పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక సూచించింది.

Advertisement