Amaravati: క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌గా అమరావతి.. స్టార్టప్‌లకు భారీ అవకాశాలు
ఈ వార్తాకథనం ఏంటి
రాజధాని అమరావతిని దేశంలోనే తొలి క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా వేగంగా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరు నాటికి ప్రపంచంలోనే అత్యాధునిక, అత్యంత వేగవంతమైన క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వాటిని ఇక్కడే తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయాలన్న దిశగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ పనిచేస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్‌తో పాటు క్వాంటమ్ సెక్యూరిటీ, సెన్సింగ్, మెటీరియల్స్ వంటి కీలక రంగాలకు అమరావతిని హబ్‌గా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. ఈ నాలుగు రంగాలకు చెందిన స్టార్టప్‌లు, భాగస్వామ్య కంపెనీలను అమరావతికి ఆహ్వానిస్తున్నారు.
వివరాలు
మరో 20 నుంచి 25 కంపెనీలు చేరే అవకాశం
ఇప్పటికే ఐదు స్టార్టప్‌లు కార్యకలాపాలు ప్రారంభించగా వచ్చే రెండు నెలల్లో మరో 20 నుంచి 25 కంపెనీలు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం వీటికి గన్నవరంలోని మేధాటవర్స్‌లో స్థలం కల్పిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ కోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. అందులో రెండు ఎకరాల్లో రూ.137 కోట్ల వ్యయంతో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (AQCC) నిర్మాణం వేగంగా సాగుతోంది. జీ+1 విధానంలో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు లేదా అక్టోబరు నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భవనం నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వాంటమ్ కంప్యూటర్‌కు అత్యంత స్థిరమైన వాతావరణం అవసరం.
వివరాలు
44 అంతస్తుల ఎనిమిది టవర్ల నిర్మాణం ప్రతిపాదన
సాధారణంగా వాహనాల వల్ల వచ్చే 70-80హెర్ట్జ్ వైబ్రేషన్లు కూడా ప్రభావం చూపకుండా, 2-100 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లను నియంత్రించేలా భవనాన్ని డిజైన్ చేస్తున్నారు. ఇందుకోసం జర్మనీ నుంచి ప్రత్యేక వైబ్రేషన్ ఐసొలేటర్లను దిగుమతి చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్ లోపల -273డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. ఇది అంతరిక్షం కంటే కూడా తక్కువ. ఈ స్థాయి ఉష్ణోగ్రతను నిర్వహించేందుకు డైల్యూషన్ రిఫ్రిజరేటర్లను ఉపయోగిస్తారు. ఈ భవనం పూర్తయ్యాక, అందులో ఐబీఎం సంస్థ క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే కొన్ని ముఖ్యమైన స్టార్టప్‌లకు కూడా అక్కడే స్థలం కల్పిస్తారు. ఇక క్వాంటమ్ వ్యాలీలో భాగంగా 44 అంతస్తుల ఎనిమిది టవర్ల నిర్మాణం ప్రతిపాదించారు. వీటిలో రెండు టవర్లను సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మించనుంది.
వివరాలు
88 వేల మందికి ఉద్యోగావకాశాలు
మొత్తం టవర్లలో 90 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేసి, సుమారు 88 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది లక్ష్యం. ఐబీఎం సంస్థ మొదట 156 క్యూబిట్స్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకుంది. అయితే నిర్మాణం ఆలస్యమవడంతో, ఇప్పుడు మరింత ఆధునిక ప్రాసెసర్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం 120 క్యూబిట్స్ ప్రాసెసర్‌లో ఎక్కువ క్యూబిట్స్ పరస్పరం కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. ఇది మరింత వేగవంతమైనది కావడంతో, అదే అమరావతిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని క్వాంటమ్ వ్యాలీ మిషన్ డైరెక్టర్ సి.వి. శ్రీధర్ వెల్లడించారు. ఇక గన్నవరంలోని మేధాటవర్స్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల్లో చిన్న స్థాయి క్వాంటమ్ కంప్యూటర్లతో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలు ఏర్పాటు చేస్తున్నారు.
వివరాలు
ఏప్రిల్ 14న ప్రారంభం
మేధాటవర్స్‌లో ఇది ఏప్రిల్ 14న ప్రారంభం కానుంది. ఈ కేంద్రాల్లో కాంపొనెంట్ల పరీక్షలు, హార్డ్‌వేర్ శిక్షణ అందిస్తారు. మేధాటవర్స్‌లో క్యూబిటెక్ సంస్థ ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తుండగా, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ స్వయంగా ఏర్పాట్లు చేస్తోంది. మేధాటవర్స్‌లోని మూడు, నాలుగు అంతస్తుల్లో క్వాంటమ్ వ్యాలీ మిషన్ కార్యాలయం, స్టార్టప్ కంపెనీలకు స్థలం కేటాయించనున్నారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ సూపర్ కండక్టింగ్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ప్రపంచంలో ఇతర సంస్థలు న్యూట్రల్ ఆటమ్, అయాన్ ట్రాప్, ఫోటానిక్ టెక్నాలజీలపై కూడా క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేస్తున్నాయి. వాటితోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయని, అవి ముందుకొస్తే ఆ టెక్నాలజీలను కూడా అమరావతిలో ఏర్పాటు చేసే అవకాశముందని తెలిపారు.