#NewsBytesExplainer: లోటు లేకుండా నిధులు.. పరుగులు తీస్తున్న అమరావతి నిర్మాణం పనులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి మరో కీలక దశలోకి ప్రవేశించింది. రాజధాని నిర్మాణ పనుల వేగవంతానికి అవసరమైన నిధులు వేగంగా సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణ ప్రణాళికలకు ఆమోదం తెలుపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సీఆర్డీఏకు (CRDA) మరో రూ. 32,500 కోట్ల రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB)తో పాటు నాబార్డ్, ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ, ఏపీపీఎఫ్‌సీ వంటి దేశీయ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి. ఈ రుణాలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ కింద మంజూరవుతున్నాయి.
Details
ప్రపంచ బ్యాంక్ నుంచి కొత్త నిధుల ఆమోదం
ఇప్పటికే రూ.1,500 కోట్ల రుణానికి సంబంధించి ఏపీపీఎఫ్‌సీతో ఒప్పందం కుదిరింది. మిగతా సంస్థలతో చర్చలు పూర్తయ్యి, అవి కూడా రుణమంజూరుకు అంగీకరించాయి. అందులో ప్రపంచ బ్యాంక్-ఏడీబీ రూ.14,000 కోట్లు, ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ రూ.10,000 కోట్లు, నాబార్డ్ రూ.7,000 కోట్లు ఇస్తున్నాయి. ఇదిలావుంటే సీఆర్డీఏ ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ.15,000 కోట్లు, హడ్కో నుంచి రూ.11,000 కోట్లు సహా మొత్తం రూ. 26,000 కోట్ల రుణాలు సమీకరించింది. తాజా రుణాలతో అమరావతి ప్రాజెక్టుకు కావాల్సిన ఆర్థిక వనరులు దాదాపుగా సమకూరనున్నాయి.
Details
అమరావతిపై తిరిగి విశ్వాసం చూపిన ప్రపంచ బ్యాంక్
అమరావతి ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంక్ మొదటి నుంచే సానుకూల వైఖరి కనబరుస్తోంది. 2019కు ముందు ఏఐఐబీ (AIIB)తో కలిసి రుణాలు ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే అప్పటి జగన్ ప్రభుత్వం రాజధాని పనులను నిలిపేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, కేంద్రం చొరవతో ప్రపంచ బ్యాంక్ మరోసారి ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా రూ.15,000 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇందులో ప్రపంచ బ్యాంక్-ఏడీబీ రూ.13,500 కోట్లు, కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్‌గా రూ.1,500 కోట్లు సమకూర్చింది.
Details
వేగంగా సాగుతున్న పనులతో అభివృద్ధి స్పష్టమే
అమరావతి నిర్మాణానికి దేశీయ సంస్థలూ సైతం విస్తృత ఆసక్తి కనబరుస్తున్నాయి. మొత్తం రూ.91,639 కోట్ల అంచనా వ్యయంతో 112 పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. వీటిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతులకు కేటాయించిన లేఅవుట్‌లు, హైకోర్టు, సచివాలయ టవర్లు, శాసనసభ భవనం, న్యాయమూర్తులు-మంత్రులు-అధికారుల నివాస గృహాలు వంటి ఐకానిక్ నిర్మాణాలున్నాయి. ఇప్పటికే 87 పనులకు టెండర్లు పిలిచి అనేక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఈ విధంగా దేశీయ, అంతర్జాతీయ సంస్థల మద్దతుతో అమరావతి అభివృద్ధి మరోసారి వేగం పుంజుకోనుంది.