LOADING...
Chandrababu: రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. రెండో విడత భూ సమీకరణకు సంపూర్ణ మద్దతిస్తామన్న రైతులు
రెండో విడత భూ సమీకరణకు సంపూర్ణ మద్దతిస్తామన్న రైతులు

Chandrababu: రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. రెండో విడత భూ సమీకరణకు సంపూర్ణ మద్దతిస్తామన్న రైతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించుకునే అంశంపై కేంద్రంతో మరోసారి చర్చలు జరుగుతాయని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా తెలిపారు. అలాగే రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు గడువును పొడిగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలోని ఐదోబ్లాక్‌లో అమరావతి రైతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈసందర్భంగా రైతులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈసమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ,"జరీబు, గ్రామ కంఠాలు,లంక భూముల సమస్యలు నాకు తెలియవచ్చాయి.లంక భూములను ల్యాండ్ పూలింగ్‌లోకి తీసుకునే విధంగా అనుమతిని ఇచ్చాను. ఏదైనా సమస్యలు ఎదురైనా ముందుగా త్రిసభ్యకమిటీతో చర్చించండి,అవసరమైతే నేను కూడా మీతో మాట్లాడతాను.అమరావతి రైతుల సమస్యలపై ఈతరహా సమీక్షలను కొనసాగిస్తాను" అని హామీ ఇచ్చారు.

వివరాలు 

భూముల విలువ ఇప్పుడు ఒక ఎకరం రూ.170 కోట్లు 

రాజధాని రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్లను అమ్మకానికి ఇవ్వరాదని చంద్రబాబు సూచించారు. "భూముల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఒకప్పుడు తక్కువ ధర కలిగిన భూముల విలువ ఇప్పుడు ఒక ఎకరం రూ.170 కోట్లకు చేరింది. అమరావతి అభివృద్ధి ఫలాలను మొదట పొందాల్సిన వారు రైతులే. అమరావతికి న్యాయం చేయడం నా బాధ్యత" అని ఆయన పేర్కొన్నారు. బిట్స్ పిలానీ, క్వాంటం వ్యాలీ వంటి సంస్థలు అమరావతిలో వస్తున్నాయని, తిరుమల తరహాలో సమగ్ర అభివృద్ధిని చేపడతామన్నారు. రెండో విడత భూ సమీకరణ ద్వారా మరిన్ని భూములను సేకరించి అభివృద్ధి కొనసాగించాలనే పిలుపునిచ్చారు.

వివరాలు 

అమరావతి డెవలప్‌మెంట్ అసోసియేషన్

ముఖ్యమంత్రి హామీలపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో 'అమరావతి డెవలప్‌మెంట్ అసోసియేషన్' రూపంలో ఏర్పడి అభివృద్ధికి సహకరిస్తామని, రెండో విడత భూ సమీకరణకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్ కూడా పాల్గొన్నారు.

Advertisement