Cyclone Montha: 17కి.మీ వేగంతో కదులుతున్న 'మొంథా'.. ఈదురు గాలులతో వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
'మొంథా' తుపాను కారణంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ దాని ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.గత ఆరు గంటల్లో సుమారు గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను,ప్రస్తుతం చెన్నైకి 480కిలోమీటర్లు,కాకినాడకు 530కిలోమీటర్లు, విశాఖపట్నానికి 560కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయం నాటికి తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం,రేపు రాత్రి కాకినాడ సమీపంలో తుపానుతీరం దాటే అవకాశముంది.
వివరాలు
కోనసీమలో తుపానుకు సిద్ధమైన అధికారులు
ఈ సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జైన్ హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలో సముద్రతీరానికి 30 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజల కోసం మొత్తం 120 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం నుంచి ఆ కేంద్రాల్లో ఉన్నవారికి భోజన వసతి కల్పించడంతో పాటు చిన్నారులకు పాలు అందజేస్తామని వివరించారు. తుపాను తీరం దాటే వరకు ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.