NTR Statue in Amravati: అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం,స్మృతి వనంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, స్మృతి వనం ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు జాతి గర్వకారణం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహం ఏర్పాటు,స్మృతి వనం అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు పి. నారాయణ, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్‌తో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGICL) ఎండీ శ్రీనివాస్ హాజరయ్యారు.
వివరాలు
3,500 టన్నుల కంచుతో భారీ ఎన్టీఆర్ విగ్రహం
సమావేశంలో ఎన్టీఆర్‌కు సంబంధించి సిద్ధం చేసిన నమూనా విగ్రహాలను మంత్రులు పరిశీలించారు. విగ్రహ డిజైన్, నిర్మాణ విధానం, కాన్సెప్ట్ అంశాలపై విస్తృతంగా చర్చించారు. విగ్రహానికి తుది రూపు ఖరారు చేయడం, అలాగే అనుబంధ నిర్మాణాల రూపకల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక ఉపసంఘాన్ని నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. అమరావతి పరిధిలోని నీరుకొండ గ్రామం సమీపంలో ఉన్న కొండపై, నీరుకొండ రిజర్వాయర్ దగ్గర సుమారు 3,500 టన్నుల కంచుతో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ విగ్రహం కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాకుండా తెలుగు జాతి వైభవం, తేజస్సు, సాంస్కృతిక గొప్పతనాన్ని చాటే స్మారకంగా నిలవనుందని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
తెలుగు వైభవం - తెలుగు తేజం"
"తెలుగు వైభవం - తెలుగు తేజం" అనే సాంస్కృతిక భావనతో ఈ విగ్రహ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎన్టీఆర్ మెమోరియల్ లైబ్రరీ, స్మృతి వనం ఏర్పాటు చేయడంతో పాటు తెలుగు సాహిత్యం, సంస్కృతి, చరిత్రపై పరిశోధనలకు కేంద్రంగా ఒక నాలెడ్జ్ హబ్‌ను అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందన్నారు. విగ్రహం, అనుబంధ నిర్మాణాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టు AGICL పర్యవేక్షణలో కొనసాగుతుందని, ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా ఎన్టీఆర్ మెమోరియల్ లైబ్రరీ, స్మృతి వనం రూపకల్పన చేయనున్నామని ఆయన వివరించారు.