Pax Silica: సిలికాన్ వ్యూహంలో అమెరికా ముందడుగు.. భారత్‌కు దక్కని చోటు
ఈ వార్తాకథనం ఏంటి
ఏఐ (Artificial Intelligence) పురోగతికి కీలకమైన సిలికాన్ సరఫరా గొలుసు (Supply Chain)ను బలోపేతం చేయడం లక్ష్యంగా, అమెరికా విదేశాంగ శాఖ 'ప్యాక్స్ సిలికా' (Pax Silica) పేరుతో కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో జపాన్, దక్షిణకొరియా, సింగపూర్, నెదర్లాండ్స్, యూకే, ఇజ్రాయెల్, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఈ కీలక కార్యక్రమంలో భారత్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ అంశాన్ని కేంద్రంగా చేసుకుని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. హైటెక్ సరఫరా గొలుసులపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే అమెరికా ఈ 'ప్యాక్స్ సిలికా' ప్రోగ్రామ్‌ను ప్రారంభించిందని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) వ్యాఖ్యానించారు.
Details
దేశానికి ఎంతో ప్రయోజనం ఉండేది
ఇటీవల ప్రధాని మోదీ-డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాల్లో ఏర్పడిన అపార్థాల నేపథ్యంలో ఈ కార్యక్రమంలో భారత్‌కు చోటు దక్కకపోవచ్చని తాము ముందే ఊహించామని, అందుకే ఇది తమను ఆశ్చర్యపరచలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవేళ ఈ బృందంలో భారత్ భాగస్వామిగా ఉండి ఉంటే, దేశానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా, గురువారం తన 'గొప్ప స్నేహితుడు' ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ఎక్స్ (X)లో పోస్టు చేసిన విషయాన్ని కూడా జైరాం రమేశ్ ప్రస్తావించారు.
Details
సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యం
మరోవైపు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం, సిలికాన్ సరఫరా విషయంలో ఇతర దేశాలపై బలవంతంగా ఆధారపడకుండా ఉండేందుకు ఈ 'ప్యాక్స్ సిలికా' ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఏఐకు సంబంధించిన పరికరాలు, సామర్థ్యాలను రక్షించడంతో పాటు, ఆధునిక సాంకేతికతల అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది భారత్‌లో 'ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026' నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమిట్ సందర్భంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిర్వహించబడుతున్న తొలి ఏఐ సదస్సు ఇదే కావడం విశేషం.