LOADING...
Amit Shah: యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ మానవాళికి పెను ముప్పు.. దీనికి పోరాటానికి రోడ్ మ్యాప్ అవసరం: అమిత్ షా
దీనికి పోరాటానికి రోడ్ మ్యాప్ అవసరం: అమిత్ షా

Amit Shah: యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ మానవాళికి పెను ముప్పు.. దీనికి పోరాటానికి రోడ్ మ్యాప్ అవసరం: అమిత్ షా

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌) అనేది మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటిగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయంగా రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అవసరమని ఆయన నిపుణులను కోరారు. గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌లోని బయోటెక్నాలజీ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న బయోకంటైన్‌మెంట్‌ ఫెసిలిటీ - బీఎస్‌ఎల్‌-4కు మంగళవారం శంకుస్థాపన చేసిన అనంతరం అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఔషధాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

ఏఎంఆర్‌ ముప్పు నుంచి కాపాడటమే ప్రధాన లక్ష్యం

ఏఎంఆర్‌ అంటే యాంటీబయోటిక్స్‌కు వ్యతిరేకంగా సూక్ష్మజీవులు అభివృద్ధి చేసుకునే నిరోధకత అని అమిత్‌ షా వివరించారు. ఈ అంశంపై మరింత స్పష్టత, బలమైన అవగాహన కోసం లోతైన పరిశోధనలు అవసరమని చెప్పారు. గర్భిణీ స్త్రీలలో ఉన్న ఏఎంఆర్‌ సమస్య తల్లి నుంచి బిడ్డకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని, దీనిని అరికట్టేందుకు కచ్చితమైన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అంటువ్యాధులను నియంత్రించడం, రాబోయే తరాలను ఏఎంఆర్‌ ముప్పు నుంచి కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు.

వివరాలు 

రెండో అతిపెద్ద కేంద్రంగా ఈ బీఎస్‌ఎల్‌-4

యాంటీబయోటిక్స్‌ను పూర్తిస్థాయిలో కోర్సు ముగించకపోవడం, సరైన అవగాహన లేకుండా వైద్యులు మందులు సూచించడం,డాక్టర్‌ సలహా లేకుండా ఇష్టానుసారంగా యాంటీబయోటిక్స్‌ను వాడటం వంటి అంశాలే ఈ ప్రమాదకర పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని అమిత్‌ షా పేర్కొన్నారు. ఏఎంఆర్‌ సమస్య వ్యక్తిగత స్థాయికే పరిమితం కాకుండా సమాజం మొత్తానికే పెద్ద ముప్పుగా మారుతోందని హెచ్చరించారు. పుణెలోని వైరాలజీ ల్యాబొరేటరీ తరువాత దేశంలో రెండో అతిపెద్ద కేంద్రంగా ఈ బీఎస్‌ఎల్‌-4 సదుపాయం నిలవనుందని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తొలి ల్యాబొరేటరీ ఇదేనని అమిత్‌ షా వెల్లడించారు.

Advertisement