31st CII Partnership Summit: అమిత్ షా విశాఖ పర్యటన రద్దు.. సీఐఐ సదస్సుకు పీయూష్ గోయల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం వేదికగా గురువారం ప్రతిష్ఠాత్మక 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకావడం లేదు. అనివార్య కారణాల వల్ల ఆయన విశాఖ పర్యటన రద్దయినట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఆయన స్థానంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సదస్సు కోసం విశాఖపట్నం నగరం ఇప్పటికే ముస్తాబైంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి తరలివస్తున్న పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. సదస్సు నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
వివరాలు
పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశం
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నాయకులు పాల్గొననున్నారు.
వీరంతా ఒకే వేదికపై సమావేశమై ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారు.