Amit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
Amit Shah CAA: భారతీయ జనతా పార్టీ (BJP) లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.
ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (CAA) దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తామని భారీ ప్రకటన చేశారు.
'ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్'లో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడారు.
ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. సీఏఏ అనేది ఎవరి పౌరసత్వాన్ని తీసివేయదని అమిత్ షా స్పష్టం చేశారు.
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లో మతపరమైన హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు పౌరసత్వం మంజూరు చేయడం కోసమే దీన్ని తీసుకొస్తున్నట్ల వివరించారు.
సీఏఏ
ముస్లింలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి: అమిత్ షా
సీఏఏ విషయంలో ప్రతిపక్షాలు ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. అలాగే వారిని రెచ్చగొడుతున్నాయన్నారు.
వచ్చే ఏడు రోజుల్లో సీఏఏను అమలు చేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ బిల్లు 2019 డిసెంబర్‌లోనే పార్లమెంటులో ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా బిల్లుకు ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది.
ఈ చట్టం బంగ్లాదేశ్, పాకిస్థాన్, అప్గాన్‌లోని మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం మంజూరు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ క్రమంలో ఈ సారి సీఏఏను అమలు చేయకుండా ఎవరూ ఆపలేరని అమిత్ షా అన్నారు.
సీఏఏ
చట్టం అమలోకి వస్తే ఏమవుతుంది?
ఈ చట్టం ప్రకారం, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లోని మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వబడుతుంది.
2014 వరకు ఏదైనా వేధింపుల కారణంగా భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం లభిస్తుంది.
ఇందులో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు ఉంటారు. ఈ బిల్లు 2016లోనే లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందలేకపోయింది.
అయితే 2019లో తిరిగి ప్రవేశపెట్టారు. 2020 జనవరి 10న రాష్ట్రపతి ఆమోదించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు కరోనాతో సరిపోవడంతో కేంద్రం సీఏఏపై దృష్టి సారించలేదు.
ఈ చట్టం ప్రకారం, 9 రాష్ట్రాలకు చెందిన 30 కంటే ఎక్కువ కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇవ్వబడతాయి.