Loading...
Amit Shah: అమిత్‌ షాకు అస్వస్థత.. హుబ్బళ్లి కార్యక్రమానికి దూరం
అమిత్‌ షాకు అస్వస్థత.. హుబ్బళ్లి కార్యక్రమానికి దూరం

Amit Shah: అమిత్‌ షాకు అస్వస్థత.. హుబ్బళ్లి కార్యక్రమానికి దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 19, 2026
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అస్వస్థతకు గురయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం శనివారం ఆయన కర్ణాటకలోని హుబ్బళ్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాలతో ఆ కార్యక్రమాలకు ఆయన హాజరుకాలేకపోయారు. హుబ్బళ్లిలో రూ.700 కోట్లతో నిర్మించిన కేఎల్‌ఈ జగద్గురు గంగాధర్‌ మహాస్వామిగళు మూరుసావిరమఠ్‌ మెడికల్‌ కళాశాల నూతన భవనంతోపాటు, 1,200 పడకల కేఎల్ఈ హాస్పిటల్ అండ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను శనివారం ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్‌ షా శుక్రవారం రాత్రే హుబ్బళ్లికి చేరుకుని అక్కడి ఓ హోటల్‌లో బస చేశారు.

వివరాలు

విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు

అయితే హోటల్‌లో ఉన్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు పరిశీలించి విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో కార్యక్రమానికి హాజరుకాకుండా హోటల్‌లోనే ఉండిపోయారు.

అమిత్‌ షా గైర్హాజరైన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్‌ ప్రకాశ్‌ పాటిల్‌, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కేఎల్‌సీ సొసైటీ ఛైర్మన్‌, రాజ్యసభ మాజీ ఎంపీ ప్రభాకర్‌ కోరే మాట్లాడుతూ.. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి అమిత్‌ షా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఆరోగ్య కారణాల రీత్యా ఆయన కార్యక్రమానికి దూరంగా ఉన్నారని వెల్లడించారు.

ADVERTISEMENT