
Andhra Pradesh: ఉద్యానంలో సిరుల పంట.. అగ్రస్థానంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు
ఈ వార్తాకథనం ఏంటి
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు సుదీర్ఘ కాలంగా కరవు ప్రభావిత ప్రాంతాలుగా పేరొందినప్పటికీ, ఉద్యాన పంటల సాగుతో అక్కడి రైతులు ఇప్పుడు మంచి ఆదాయం సాధిస్తున్నారు. పండ్లు,కూరగాయలు,పూలు,సుగంధ ద్రవ్యాలు వంటి పంటల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు జిల్లాలు కలిపి రూ.30 వేల కోట్ల స్థూల ఉత్పత్తి విలువ జోడింపు (జీవీఏ)ని సాధించాయి. రాష్ట్రవ్యాప్తంగా జీవీఏ పరంగా ఈ రెండు జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఇక ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం వంటి మండలాలు కూడా ఉద్యాన పంటల ద్వారా ఉన్నత స్థాయి జీవీఏ సాధించి గమనించదగిన స్థితిలో నిలిచాయి. ఈ మేరకు ఉద్యాన పంటల ద్వారా అత్యధిక జీవీఏ నమోదు చేసిన జిల్లాలు,డివిజన్లు, మండలాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
వివరాలు
అగ్రస్థానంలో లింగాల మండలం
వైఎస్సార్ కడప జిల్లాలోని లింగాల మండలం ఉద్యాన మండల ద్వారా అత్యధికంగా రూ.2,130 కోట్ల జీవీఏ సాధించింది. బత్తాయి, అరటి, పుచ్చ, టమాటా పంటల సాగు ప్రధాన కారణంగా రైతులు అధిక ఆదాయం అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలం అలంకరణ మొక్కలు, పండ్ల నర్సరీల ద్వారా రూ.1,758 కోట్ల జీవీఏతో ముందంజలో నిలిచింది. ఇక అగ్రస్థానాల్లో ఉన్న ఇతర మండలాల్లో అనంతపురం జిల్లాలోని పుట్లూరు, ఎల్లనూరు; ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం; ఎన్టీఆర్ జిల్లా మైలవరం; ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల; అనంతపురం జిల్లాలోని నార్పల; అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు ఉన్నాయి.
వివరాలు
డివిజన్లలో అనంతపురం.. తర్వాత పులివెందుల
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల ద్వారా అత్యధిక జీవీఏ నమోదు చేసిన డివిజన్ అనంతపురం డివిజన్‌గా రాష్ట్ర ఉద్యాన శాఖ పేర్కొంది. బత్తాయి, అరటి పంటల సాగు ద్వారా ఈ డివిజన్‌లో రూ.9,876 కోట్ల జీవీఏ నమోదు అయింది. రెండోస్థానంలో వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల డివిజన్ ఉంది. అరటి, బత్తాయి, టమాటా పంటల ద్వారా అక్కడ రూ.6,177 కోట్ల జీవీఏ వచ్చినట్లు గుర్తించారు. మూడోస్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్ నిలిచింది. మిరియాలు, పసుపు, కాఫీ పంటల ద్వారా మొత్తం రూ.5,674 కోట్ల జీవీఏ వచ్చింది. ఇందులో మిరియాల ద్వారా రూ.2,326 కోట్లు, పసుపు రూ.552 కోట్లు, కాఫీ రూ.534 కోట్లు వేర్వేరుగా వచ్చినవి.
వివరాలు
ఇతర డివిజన్ల జీవీఏ వివరాలు:
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం - ₹5,264 కోట్లు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ - ₹4,433 కోట్లు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు - ₹4,175 కోట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం - ₹4,028 కోట్లు అన్నమయ్య జిల్లా రాజంపేట - ₹4,003 కోట్లు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం - ₹3,793 కోట్లు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం - ₹3,594 కోట్లు