Anantnag encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం.. నాలుగుకు చేరిన మరణాలు
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం పొందాడు. దీంతో ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం మరణాలు నాలుగుకు చేరుకున్నాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఓ అధికారి తెలిపారు. అనంత్‌నాగ్‌లోని కోకెర్‌నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు బుధవారం కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, డీఎస్పీ హుమయూన్ భట్ నేతృత్వంలో భద్రతా బలగాలు వెళ్లాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, హుమయూన్ భట్ మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన మరో సైనికుడు శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. భద్రతా సిబ్బంది మృతికి వ్యతిరేకంగా జమ్మూలో పాకిస్థాన్ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి.