LOADING...
Telangana: కృష్ణా తీరంలో మూడు వేల ఏళ్ల పురాతన నగర శిథిలాలు గుర్తింపు
కృష్ణా తీరంలో మూడు వేల ఏళ్ల పురాతన నగర శిథిలాలు గుర్తింపు

Telangana: కృష్ణా తీరంలో మూడు వేల ఏళ్ల పురాతన నగర శిథిలాలు గుర్తింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని వీర్లపాలెం-వీరప్పగూడెం గ్రామాల దక్షిణ సరిహద్దుల వెంట కృష్ణా నది ఎడమ ఒడ్డున ఒక పురాతన నగరానికి చెందిన శిథిలాలు వెలుగుచూశాయని ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, లభించిన పురావస్తు ఆధారాల ప్రకారం ఈ నగరం సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమై క్రీ.శ. 15వ శతాబ్దం వరకు నిరంతరంగా మనుగడ సాగించినట్టు తెలుస్తోందన్నారు. ఈ ప్రాంతంలో ఇనుప యుగానికి చెందిన వందల సంఖ్యలో భారీ శిలా సమాధులు (కెయిరన్లు) ఉన్నాయని, ఇవి వీరుల సమాధులని స్థానికులు విశ్వసించడంతోనే వీరులపాడు, వీరప్పగూడెం అనే పేర్లు స్థిరపడినట్టు చెప్పారు.

వివరాలు 

పురావస్తు శాఖ సమగ్ర డాక్యుమెంటేషన్‌ చేపట్టాలి..

పలుచోట్ల దొరికిన ఇనుప చిట్టాలు ఇక్కడ అప్పట్లో ఇనుము తయారీ జరిగిందని సూచిస్తున్నాయని తెలిపారు. అయితే ఈ వీరులపాడు ప్రాంతం ఇప్పటివరకు పురావస్తు శాఖ దృష్టికి రాకపోవడం విచారకరమన్నారు. మధ్యయుగ కాలానికి చెందిన (క్రీ.శ. 10-15 శతాబ్దాలు) కోట గోడలు, బురుజులు, ధాన్యాగారాలు, ఆలయాలు, బావులు, నివాస గృహాలు, శిల్పాలు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, సిమెంటు కంపెనీల కార్యకలాపాలు,కొందరు స్థానికుల చర్యల కారణంగా ఇవి వేగంగా ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలువైన చారిత్రక వారసత్వం పూర్తిగా కనుమరుగుకాకముందే కనీసం సమగ్ర డాక్యుమెంటేషన్‌ అయినా చేపట్టాలని పురావస్తు శాఖను ఆయన కోరారు.

Advertisement