LOADING...
Triveni Sangam: త్రివేణి సంగమం వద్ద పురాతన భూగర్భ నది ఆనవాళ్లు గుర్తింపు
త్రివేణి సంగమం వద్ద పురాతన భూగర్భ నది ఆనవాళ్లు గుర్తింపు

Triveni Sangam: త్రివేణి సంగమం వద్ద పురాతన భూగర్భ నది ఆనవాళ్లు గుర్తింపు

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి నదుల కలయికను త్రివేణి సంగమంగా శతాబ్దాలుగా ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే సరస్వతి నదిని ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదు. పురాణాల్లో ఉన్న ప్రస్తావనల ఆధారంగానే ఈ నదిపై నమ్మకం కొనసాగుతోంది. ఇప్పుడు ఆ విశ్వాసానికి శాస్త్రీయ ఆధారాలు లభించేలా హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. కేంద్ర భూగర్భ జలాల మండలి సహకారంతో నిర్వహించిన పరిశోధనలో గంగ, యమున నదుల మధ్య భూగర్భంలో ఒక భారీ పురాతన నది ప్రవహించిన ఆనవాళ్లను గుర్తించారు. హెలికాప్టర్‌ సాయంతో నిర్వహించిన అత్యాధునిక భౌగోళిక సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు.

వివరాలు 

నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల వెడల్పుతో భూగర్భ నది

ఈ భూగర్భ నది సుమారు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నట్లు గుర్తించారు. భూమి ఉపరితలం నుంచి దాదాపు పది నుంచి పదిహేను మీటర్ల లోతులో ఈ నది ప్రవహించినట్లు తేలింది. ప్రయాగ్‌రాజ్‌ నుంచి కాన్పుర్‌ వరకు సుమారు రెండు వందల కిలోమీటర్ల మేర ఈ నది ఆనవాళ్లు కనిపించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. పురాణాల్లో చెప్పిన సరస్వతి నది ప్రవాహ మార్గానికి సమీపంలోనే ఈ నది ఆనవాళ్లు బయటపడటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దీనిని నేరుగా సరస్వతి నదిగా ఇప్పుడే నిర్ధారించలేమని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్‌ సుభాష్‌ చంద్ర స్పష్టం చేశారు.

వివరాలు 

భూగర్భ నదిలో కొంతమేర నీరు

గంగ,యమున నదుల మార్గ మార్పుల వల్ల ఈ ప్రవాహం ఏర్పడలేదని,ఇది పూర్తిగా మూడో నది అని ఆయన తెలిపారు. సాహిత్యఆధారాల ప్రకారం గంగోత్రిలో గంగ,యమునోత్రిలో యమున,హిమాలయ ప్రాంతంలో సరస్వతి పుట్టి ప్రయాగ్‌రాజ్‌లో కలుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్తించిన నది ఆనవాళ్లు ప్రయాగ్‌రాజ్‌ నుంచి కాన్పుర్‌ వరకు లభించాయని,భవిష్యత్తులో హిమాలయ ప్రాంతాల వరకూ ఈ ప్రవాహ ఆనవాళ్లు గుర్తిస్తే దానిని సరస్వతి నదిగా చెప్పే అవకాశం ఉంటుందని వివరించారు. ఈఆవిష్కరణ భవిష్యత్తు నీటి అవసరాల దృష్ట్యా కూడా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భూగర్భ నదిలో కొంతమేర నీరు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వర్షపు నీటిని ఈ ప్రవాహంలోకి మళ్లించడం ద్వారా భూగర్భజలమట్టాలను గణనీయంగా పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement