Andhra HC: 'జూడో' నకిలీ ధ్రువపత్రాలపై నాలుగు నెలల్లో విచారణ జరపండి.. అధికారులకు హైకోర్టు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
జూడో క్రీడ పేరుతో నకిలీ ధ్రువపత్రాలు పొంది విద్యా ప్రవేశాలు,ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్‌కే పురుషోత్తం దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ సమర్పించిన పత్రాలు,రిట్ పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలను పరిశీలించి చట్ట ప్రకారం విచారణ నిర్వహించాలని,సాధ్యమైనంత త్వరగా గరిష్ఠంగా నాలుగు నెలల్లో తుది నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులకు(కాంపిటెంట్ అథార్టీ)హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే నిర్ణయం తీసుకునే ముందు నకిలీ ధ్రువపత్రాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కూడా ఆదేశించింది.
వివరాలు
ఏపీ జూడో అసోసియేషన్ పేరుతో నకిలీ క్రీడా ధ్రువపత్రాలు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఒ. మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఏపీ జూడో అసోసియేషన్ పేరుతో నకిలీ క్రీడా ధ్రువపత్రాలు పొంది 2017 నుంచి పలువురు విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందడంతో పాటు గ్రామ సచివాలయం, పశుసంవర్ధక శాఖ, మెగా డీఎస్సీ-2025 నియామకాలలో కూడా ఉద్యోగాలు సాధించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ అంశంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.
వివరాలు
విచారణ అనంతరం చట్టపరమైన నిర్ణయం
మరోవైపు హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది జయంతి వాదనలు వినిపిస్తూ, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పిటిషనర్‌ను కోరినా ఆయన స్పందించలేదని కోర్టుకు తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, పిటిషనర్ సమర్పించిన దస్త్రాలు, రిట్ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ స్పోర్ట్స్ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది.
విచారణ అనంతరం చట్టపరమైన నిర్ణయం తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది.