Andhra pradesh: యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఏపీకి రెండో స్థానం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనకు యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదిక నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక భద్రత విభాగంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించిందని వెల్లడించారు. సోమవారం రాజధాని అమరావతిలో చంద్రబాబు మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక భద్రత విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు 0.69 స్కోరు లభించిందని తెలిపారు. ప్రాథమిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత, న్యాయ సేవలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించినట్లు వివరించారు.
వివరాలు
ఈ రంగాలకు ప్రాధాన్యత
కేరళ, తమిళనాడు, తెలంగాణ, సిక్కిం వంటి రాష్ట్రాల కంటే ఏపీ మెరుగైన ర్యాంకు సాధించిందని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్ర ఆదాయ స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే అంచనాలకు మించి 0.15 పాయింట్ల స్కోరు సాధించిందని చెప్పారు.
ఆదాయానికి, ప్రజలకు అవకాశాలు కల్పించడానికి మధ్య దేశంలోనే అత్యధిక సానుకూల వ్యత్యాసం ఆంధ్రప్రదేశ్‌లో నమోదైందని వివరించారు.
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చంద్రబాబు తెలిపారు.
తాగునీరు, పారిశుద్ధ్యం, గృహ వసతి, వైద్యం, విద్య, ఉపాధి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.
బ్యాంకింగ్, బీమా, పింఛన్లు, న్యాయ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు.
వివరాలు
23 విభాగాల్లోని 60 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరు అంచనా
ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి ప్రభుత్వ పాలన, అభివృద్ధి ఫలాలు చేరుతున్నాయని చంద్రబాబు అన్నారు.
యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో రాష్ట్రం మెరుగైన స్థానం సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన సీఎన్ఈఎస్ (CNES) ఈ యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదికను రూపొందించింది.
మొత్తం 23 విభాగాల్లోని 60 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేసింది.
సామాజిక, ఆర్థిక భద్రతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
దేశంలోని 28 రాష్ట్రాలను పరిశీలించగా ఏపీ 0.66 స్కోరుతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
వివరాలు
0.68 స్కోరుతో మొదటి స్థానంలో గోవా
గోవా 0.68 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ట్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ర్యాంకు సాధించింది.
తలసరి ఆదాయంలో రాష్ట్రం 13వ స్థానంలో ఉండగా.. అవకాశాల కల్పనలో రెండో స్థానాన్ని పొందింది.
రాష్ట్ర ఆదాయ స్థాయికి మించి ప్రజలకు సేవలు, సౌకర్యాలు అందించడంలో ఏపీ ప్రత్యేకతను చాటుకుందని నివేదిక స్పష్టం చేసింది.