ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్
పాఠశాల విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న గోరుముద్ద ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. రాగి జావ కోసం ప్రభుత్వం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచ్చించి పిల్లలకు పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థుల మేథో వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించనున్నట్లు జగన్ చెప్పారు. బడి మానేసిన పిల్లల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.
గోరుముద్ద కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు: సీఎం జగన్
6వ తరగతి నుంచి ప్రతి తరగతిలో డిజిటల్ బోధనతో ప్రభుత్వ పాఠశాలలను డిజిటలీకరించామని, ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చామని సీఎం జగన్ చెప్పారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనలతో విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తున్నామన్నారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తున్నామని, సత్యసాయి ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నేటి నుంచి గోరుముద్దలో రాగి జావను కలుపుతున్నామని సీఎం జగన్ తెలిపారు.