LOADING...
#NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసు ఏంటి?.. జయచంద్ర రెడ్డి ఎవరు.. అతని వెనుక ఎవరున్నారు?
అతని వెనుక ఎవరున్నారు?

#NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసు ఏంటి?.. జయచంద్ర రెడ్డి ఎవరు.. అతని వెనుక ఎవరున్నారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2025
06:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి,ఆయనకు సన్నిహితుడైన కట్టా సురేంద్ర నాయుడును నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదురవడంతో తెలుగుదేశం పార్టీ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అక్టోబర్ 3న అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం ములకల చెరువు ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు భారీ మొత్తంలో నకిలీ మద్యం పట్టుకున్నారు. దాదాపు రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం, 40 స్పిరిట్ క్యాన్లు, సరఫరాకు సిద్ధంగా ఉన్న 17,224 సీసాలు, ఖాళీ బాటిళ్లు, వివిధ బ్రాండ్ల లేబుళ్లు, మూతలు మొదలైనవన్నీ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

వివరాలు 

కేసులో 23 మంది నిందితులు 

రాయచోటి ఎక్సైజ్ అధికారి జితేంద్ర మాట్లాడుతూ, "జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. మొత్తం 21 మందిపై కేసు నమోదు చేశాం, అందులో 13 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశాం. వీరిపై ఇంతకుముందు ఇలాంటి కేసులు లేవు" అని తెలిపారు. ఈ కేసులో మొత్తం 23 మందిని ఎక్సైజ్ అధికారులు నిందితులుగా చేర్చారు. 17వ నిందితుడైన జయచంద్రారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నట్టు సమాచారం. బెంగళూరుకు తిరిగి వచ్చిన వెంటనే అరెస్ట్ చేయాలనే ప్రణాళికలో ఉన్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. కేసులో విజయవాడకు చెందిన జనార్దన్ రావు ప్రధాన నిందితుడు (A1) కాగా, ఆయన అనుచరుడు కట్టా రాజు రెండో నిందితుడు (A2).

వివరాలు 

బ్రాండ్ల ఒరిజినల్ లేబుళ్లతో.. క్వార్టర్ బాటిళ్లలో నకిలీ మద్యం

వీరు ములకల చెరువులోని ఓ అద్దె ఇంట్లో నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ తయారైన మద్యాన్ని విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న బాట్లింగ్ యూనిట్‌లో ప్రాసెస్ చేశారని అధికారులు తెలిపారు. వారు తయారు చేసిన మద్యం ప్రసిద్ధ బ్రాండ్ల ఒరిజినల్ లేబుళ్లతో వేలాది క్వార్టర్ బాటిళ్లలో నింపినట్టు దర్యాప్తులో తేలింది.

వివరాలు 

వ్యాపారం నుంచి నకిలీ తయారీ దిశగా 

జనార్దన్ రావు 2012 నుంచి మద్యం వ్యాపారంలో ఉన్నారు. కానీ 2021 నాటికి పోటీ పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొని,ఆ తర్వాత నకిలీ మద్యం తయారీకి మొగ్గుచూపారని ఎక్సైజ్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నిజాంపేటలో గది అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తరలించడాన్ని ప్రారంభించి, బాక్సులపై "ఫినాల్" అని లేబుల్ వేసి మోసపూరితంగా రవాణా చేశారని రిపోర్ట్‌లో ఉంది. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి,జనార్దన్ రావుతో సన్నిహితులు. 2025లో జయచంద్రారెడ్డి ములకలచెరువులో మద్యం వ్యాపారం ప్రారంభించారని, ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో జనార్దన్ రావు కూడా అక్కడికి వెళ్లారని అధికారులు తెలిపారు. ములకల చెరువు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో నకిలీ మద్యం ఉత్పత్తికి జనార్దన్ రావే సూత్రధారిగా రిమాండ్ రిపోర్టులో పేర్కొనబడింది.

వివరాలు 

మరికొందరు నిందితులు 

జయచంద్రారెడ్డి ఈ కేసులో 17వ నిందితుడు కాగా, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి 18వ నిందితుడు. నకిలీ మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్, లేబుళ్లు, బాటిళ్లు సరఫరా చేసిన రవి, శ్రీనివాసరెడ్డి, చైతన్యబాబు, బెంగళూరుకు చెందిన బాలాజీ, సుదర్శన్, అకౌంటెంట్ అన్బరసు, డ్రైవర్ అష్రఫ్ వంటి వారిని కూడా నిందితులుగా చేర్చారు. జనార్దన్ రావు దక్షిణాఫ్రికా నుంచి విజయవాడ చేరగానే గన్నవరం విమానాశ్రయంలో ఎక్సైజ్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది.

వివరాలు 

"ఎవరినీ వదలం " — మంత్రి కొల్లు రవీంద్ర 

రాష్ట్రంలో నకిలీ మద్యం కేసును ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. "జయచంద్రారెడ్డి ప్రమేయం ఉన్నట్లు తెలిసిన వెంటనే పార్టీ చర్యలు తీసుకుంది. అదే సమయంలో స్థానిక ఎస్‌హెచ్ఓ పైనా సస్పెన్షన్ విధించాం" అని ఆయన తెలిపారు.

వివరాలు 

రాజకీయ దాడులు, ఆరోపణలు 

టీడీపీ ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ, "జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు వైసీపీ నుంచి వచ్చిన కోవర్టులు. మా పార్టీకి అపకీర్తి తేవడానికే ఈ కుట్ర. మా నాయకులపై ఆరోపణలు రాగానే వారిని సస్పెండ్ చేశాం. వైసీపీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, నారాయణస్వామిలపై చర్యలు తీసుకుంటుందా?" అని ప్రశ్నించారు. దీనికి ప్రతిగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందిస్తూ, "తెలుగుదేశం పార్టీ నకిలీ మద్యం తయారీని రాష్ట్రవ్యాప్తంగా కుటీర పరిశ్రమలా మార్చింది. తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాయకుడే ఇప్పుడు నిందితుడు. ప్రభుత్వం దర్యాప్తును సీబీఐ చేత చేయించాలని డిమాండ్ చేస్తున్నాం" అన్నారు.

వివరాలు 

జయచంద్రారెడ్డి ఎవరు? 

జయచంద్రారెడ్డి ములకల చెరువు మండలం కదిరినాధునికోట గ్రామానికి చెందినవారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేశారు. 2013లో బంధువుతో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లి లిక్కర్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఆఫ్రికా దేశాల్లో ఎనిమిది లిక్కర్ ఫ్యాక్టరీలు స్థాపించారు. ప్రముఖ మీడియా పరిశీలించింది. అఫిడవిట్ ప్రకారం, ఆయన అంగోలా, ఐవరీ కోస్ట్, బుర్కినా ఫాసో, కామెరూన్ వంటి దేశాల్లో డిస్టిలరీల్లో పెట్టుబడులు పెట్టారు. తర్వాత ములకల చెరువులో స్థిరపడి సేవా కార్యక్రమాలు, దేవాలయాల అభివృద్ధికి విరాళాలు ఇస్తూ.. పెద్దిరెడ్డి కుటుంబానికి చేరువయ్యారు. నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా పెద్దిరెడ్డిని కలుస్తూ జగన్ బర్తడేలకు కేక్ కట్ చేయడం లాంటివి చేసేవారు.

వివరాలు 

రాజకీయ ప్రస్థానం 

ప్రారంభంలో వైసీపీ సానుభూతిపరుడైన జయచంద్రారెడ్డి, 2024లో టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి తంబళ్లపల్లె నుంచి పోటీ చేశారు. అయితే ఓడిపోయిన తరువాత పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. తర్వాత నకిలీ మద్యం కేసులో ఆరోపణలు రావడంతో పరారీలో ఉన్న ఆయన, ఇటీవల వీడియోలో స్పందిస్తూ, "నేను ఎటువంటి తప్పు చేయలేదు. పార్టీ నన్ను విచారణ పూర్తయ్యేవరకు సస్పెండ్ చేసింది. నిర్దోషిగా బయటకు వస్తాను" అన్నారు.

వివరాలు 

జోగి రమేష్ పై జనార్దన్ రావు సంచలన ఆరోపణలు 

ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అద్దేపల్లి జనార్దన్ రావు. వైసీపీ పాలనలో జోగి రమేష్ నకిలీ మద్యం తయారీ ప్రారంభమైందని, ప్రభుత్వం మారగానే ఆ కార్యకలాపాలు ఆపేశామని తెలిపారు. అయితే, 2025 ఏప్రిల్‌లో మళ్లీ అదే పని చేయమని జోగి రమేష్ ఆదేశించారని చెప్పారు. "తంబళ్లపల్లెలో తయారీ ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వంపై మట్టి చల్లవచ్చని జోగి రమేష్ సూచించారు. అన్ని ఏర్పాట్లు చేసిన తరువాత, ఆయనే రైడ్ చేయించి మమల్నిఇరికించారు. ఇలా చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే కుట్ర పన్నారు" అని జనార్దన్ రావు పేర్కొన్నారు.

వివరాలు 

జోగి రమేష్ పై జనార్దన్ రావు సంచలన ఆరోపణలు 

"టీడీపీ నేతలను సస్పెండ్ చేయించడంలో కూడా ఆయనకు ప్రమేయం ఉంది. ఇబ్రహీంపట్నంలో రైడ్ జరగడానికి కూడా జోగి రమేష్ సూచనలే కారణం. నా తమ్ముడిని కూడా ఈ కేసులో ఇరికించారు. జయచంద్రారెడ్డికి దీనితో అసలు సంబంధం లేదు" అని ఆయన తెలిపారు. నకిలీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని కుదిపేసింది. పాలక-ప్రతిపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు, వీడియోలు, సస్పెన్షన్‌లు ఇప్పుడు ఈ కేసుకు మరింత ప్రాధాన్యత తెచ్చాయి.