LOADING...
Andhra Pradesh: విశ్వవిద్యాలయాల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి.. నేడు నోటిఫికేషన్‌ విడుదల

Andhra Pradesh: విశ్వవిద్యాలయాల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి.. నేడు నోటిఫికేషన్‌ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్'లోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల ప్రకటించిన ఉద్యోగాల క్యాలెండర్‌ ప్రకారం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది. మొత్తం పోస్టుల్లో 279 బ్యాక్‌లాగ్‌ ఖాళీలు కాగా, 1,244 రెగ్యులర్‌ పోస్టులు ఉన్నాయి. సహాయ ఆచార్యుల నియామకాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజాసేవా సంఘం ద్వారా అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. అయితే అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీలో రాత పరీక్ష ఉండదని స్పష్టం చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.

వివరాలు 

ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రాధాన్యం

విశ్వవిద్యాలయాల వారీగా చూస్తే రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయంలో అత్యధికంగా 311 పోస్టులు ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 125, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 103 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వం మరో ప్రత్యేక ఉత్తర్వును కూడా విడుదల చేసింది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న అధ్యాపకుల వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపాలని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు ఇచ్చింది.

వివరాలు 

ఏడాదికి 0.5% చొప్పున..

సేవా కాలాన్ని ఆధారంగా చేసుకుని వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నారు. ప్రతి ఏడాదికి 0.5 శాతం చొప్పున గరిష్ఠంగా పదేళ్ల సేవను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే ఈ వెయిటేజీ వర్తిస్తుంది. ఇంటర్వ్యూలో కూడా ప్రతి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్ఠంగా 10 మార్కుల వరకు వెయిటేజీ ఇవ్వనున్నారు. రాత పరీక్షలో కనీస అర్హత మార్కులను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 30 శాతం, బీసీ అభ్యర్థులకు 35 శాతం, ఇతర అభ్యర్థులకు 40 శాతం కనీస మార్కులుగా నిర్ణయించారు.

Advertisement

వివరాలు 

దరఖాస్తుల స్వీకరణ.. ముఖ్యమైన తేదీలు

కామన్‌ రిక్రూట్‌మెంట్‌ పోర్టల్‌లో నోటిఫికేషన్‌: మే 15 ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ: మే 18 ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: జూన్‌ 8 హార్డ్‌ కాపీతో దరఖాస్తు సమర్పణ: జూన్‌ 15 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థుల ప్రాథమిక జాబితాల అర్హత జాబితా: జూన్‌ 22 ప్రాథమిక అర్హతపై అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: జూన్‌ 29 స్క్రీనింగ్‌ టెస్ట్‌కు తుది అర్హత జాబితా ప్రదర్శన: జూన్‌ 30 దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్లు చిరునామాకామన్‌ రిక్రూట్‌మెంట్‌ పోర్టల్‌: https://apuniversitiesrecruitment.apcfss.in నైపుణ్యం పోర్టల్‌: https://naipunyam.ap.gov.in/jobcalendar

Advertisement