LOADING...
Andhra News: గూగుల్‌ డేటా సెంటర్‌ క్యాంపస్‌కు భూముల అప్పగింతకు ప్రభుత్వ అనుమతి
గూగుల్‌ డేటా సెంటర్‌ క్యాంపస్‌కు భూముల అప్పగింతకు ప్రభుత్వ అనుమతి

Andhra News: గూగుల్‌ డేటా సెంటర్‌ క్యాంపస్‌కు భూముల అప్పగింతకు ప్రభుత్వ అనుమతి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
08:25 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలో గూగుల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న భారీ డేటాసెంటర్‌ ప్రాజెక్టుకు అవసరమైన భూముల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గూగుల్‌కు చెందిన అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు, అధికారికంగా నోటిఫై చేసిన భాగస్వామ్య సంస్థలు కలిసి నిర్మించనున్న 1,000మెగావాట్ల సామర్థ్యం గల ఏఐ డేటా సెంటర్‌కు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించేందుకు కూడా అంగీకారం తెలిపింది. డేటాసెంటర్‌ క్యాంపస్‌ను అభివృద్ధి చేసుకునేందుకు రైడెన్‌,దాని నోటిఫైడ్‌ భాగస్వామ్య సంస్థలకు భూములు బదిలీ చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టు పూర్తికాలేదని లేదా ఆలస్యానికి సరైన కారణాలు చూపలేదని తేలితే రైడెన్‌తో పాటు దాని భాగస్వామ్య సంస్థలపై వాణిజ్యచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వివరాలు 

ఏపీఐఐసీ ద్వారా డేటా సెంటర్‌ క్యాంపస్‌ కోసం భూములు

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం ఈ సంస్థ సుమారు 15 బిలియన్‌ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ప్రాజెక్టును అత్యుత్తమ నాణ్యతతో,నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని,ఈ మేరకు పనుల అమలు తీరును నిత్యం పర్యవేక్షిస్తామని రైడెన్‌ వెల్లడించింది. ఏపీఐఐసీ ద్వారా డేటా సెంటర్‌ క్యాంపస్‌ కోసం గుర్తించిన భూములు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా అడవివరం,ముడసర్లోవ గ్రామాల్లో మొత్తం 120ఎకరాలు,విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో 200ఎకరాలు,అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతంలో 160ఎకరాల భూమిని ప్రాజెక్టుకు కేటాయించనుంది. ప్రాథమిక నోటిఫైడ్‌ భాగస్వామ్య సంస్థగా అదానీ ఇన్‌ఫ్రా (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఏపీఐఐసీ ద్వారా ఈ భూములను అప్పగించాలని రైడెన్‌ ప్రభుత్వం వద్ద అభ్యర్థించింది.

వివరాలు 

అంతర్గతంగా బదిలీ

ప్రారంభపనులు పూర్తయ్యాక, భూములను ప్రాజెక్టు అవసరాల మేరకు వివిధ భాగస్వామ్య సంస్థల మధ్య అంతర్గతంగా బదిలీ చేసుకునేలా ప్రతిపాదించింది. రాంబిల్లి ప్రాంత భూములను డేటాసెంటర్‌ క్యాంపస్‌ అభివృద్ధి కోసం ఎన్‌ఎక్స్‌ట్రా డేటా లేదా దాని అనుబంధ సంస్థలకు బదిలీ చేయాలని రైడెన్‌ నిర్ణయించగా,తర్లువాడ,అడవివరం,ముడసర్లోవ ప్రాంతాల్లోని భూములను అదానీ కనెక్ట్స్‌ లేదా దాని అనుబంధ సంస్థలకు అప్పగించాలనే ప్రతిపాదన చేసింది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా రైడెన్‌ నోటిఫై చేసిన సంస్థలు ఇవే: అదానీ ఇన్‌ఫ్రా (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌,అదానీ కనెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌,అదానీ పవర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌,భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌,ఎన్‌ఎక్స్‌ట్రా డేటా లిమిటెడ్‌(భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన అనుబంధ సంస్థ),అలాగే ఎన్‌ఎక్స్‌ట్రా వైజాగ్‌ లిమిటెడ్‌ (భారతీ ఎయిర్‌టెల్‌ గ్రూప్‌కు చెందిన మరో సంస్థ).

Advertisement

వివరాలు 

భాగస్వామ్య సంస్థలకు ఈ విషయంలో ప్రభుత్వ అనుమతి

డేటా సెంటర్‌, దానికి అనుబంధ పర్యావరణ వ్యవస్థ రూపకల్పనలో భాగంగా, ఈ భాగస్వామ్య సంస్థలకూ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందుబాటులో వచ్చేలా సులభతరం చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, భాగస్వామ్య సంస్థలకు సంబంధించిన ప్రతీ మార్పు లేదా ఏర్పాటు విషయంలో ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రోత్సాహకాలు పొందాలంటే సంస్థలు నిర్దేశిత పెట్టుబడులను తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు 2025 ఆగస్టు 22న సమర్పించిన డీపీఆర్‌కు పూర్తిగా అనుగుణంగా అమలవుతుందని ప్రభుత్వం తెలిపింది. రైడెన్‌, గూగుల్‌, గూగుల్‌ క్లౌడ్‌ సహా అన్ని అనుబంధ సంస్థలు ఈ అభివృద్ధికి కట్టుబడి ఉంటాయని రైడెన్‌ వెల్లడించింది.

Advertisement

వివరాలు 

డేటా సెంటర్‌ క్యాంపస్‌లో నిర్మించే మౌలిక వసతులు

డేటా సెంటర్‌ క్యాంపస్‌లో నిర్మించే మౌలిక వసతులు గూగుల్‌ ప్రమాణాలకు తగిన విధంగా, ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న డేటా సెంటర్‌ స్థాయిలకు అనుగుణంగానే ఉంటాయని స్పష్టం చేసింది. సెర్చ్‌, యూట్యూబ్‌, వర్క్‌స్పేస్‌ వంటి గూగుల్‌ సేవలను నిర్వహించే స్థాయికి తగ్గ నాణ్యత ప్రమాణాలతోనే ఇక్కడ కూడా కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపింది. భాగస్వామ్య సంస్థల్లో ఎవరైనా మధ్యలో తప్పుకుంటే, ఆ విషయాన్ని ప్రభుత్వానికి రైడెన్‌ అధికారికంగా నోటీసు రూపంలో తెలియజేస్తుందని, ప్రాజెక్టు నిరంతరంగా కొనసాగేందుకు అవసరమైన విధంగా భూముల బదిలీపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచిస్తామని పేర్కొంది.

Advertisement