
Andhra Pradesh : ఏపీలో మరోసారి బీపీఎస్,ఎల్‌ఆర్‌ఎస్.. ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తరువాత మార్గదర్శకాలు
ఈ వార్తాకథనం ఏంటి
అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాలు, అలాగే అనుమతులు పొందకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్‌లను క్రమబద్ధీకరించేందుకు ఏపీ ప్రభుత్వం మరోసారి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్), లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకాల అమలుకు సంబంధించి తయారు చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదమిచ్చిన తరువాత అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. దీని ద్వారా చాలా కాలంగా ఎదురు చూస్తున్న పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న ప్రజలకు తమ భవనాలు, లేఅవుట్‌లలోని ప్లాట్లను చట్టపరంగా క్రమబద్ధీకరించుకునే అవకాశం లభించనుంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ పథకాలు అమలులోకి తెచ్చారు.
వివరాలు
బీపీఎస్ పథకానికి సంబంధించి 90 శాతం, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్లో 65 శాతం వరకు పరిష్కారం
అయితే ఆ సమయంలో గడువు ముగియడంతో ఈ పథకాలను నిలిపివేశారు. అప్పట్లో వచ్చిన దరఖాస్తుల్లో బీపీఎస్ పథకానికి సంబంధించి 90 శాతం, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్లో 65 శాతం వరకు పరిష్కారమయ్యాయి. అయితే గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో అనుమతులు తీసుకోకుండా భవనాలు నిర్మించడం, లేఅవుట్‌లు ఏర్పాటు చేయడం విపరీతంగా పెరిగిపోయింది. ఆ పార్టీ నేతలు ఈ అక్రమ నిర్మాణాలకు మద్దతుగా వ్యవహరించడంతో అధికారులు చర్యలు తీసుకోవడం మానేశారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 123 పురపాలక, నగరపాలక సంస్థల్లో మొత్తం 30,065 ఇళ్లు, భవనాలకు ఆస్తిపన్ను కూడా విధించని విషయం బయటపడింది.
వివరాలు
అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్‌ల సంఖ్య 20 వేలకుపైగా
ఈ నివేదిక ద్వారా వైఎస్సార్‌సీపీ నేతలు అధికార యంత్రాంగంపై ఎంత ఒత్తిడి తీసుకువచ్చారో స్పష్టమవుతుంది. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్‌ల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 20 వేలకుపైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, అనకాపల్లి జిల్లాల్లో ఎక్కువగా అనుమతులు లేకుండా ఏర్పాటైన లేఅవుట్‌లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఎల్‌ఆర్‌ఎస్ పథకం ద్వారా ఇప్పటివరకు అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్‌లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు చట్టబద్ధంగా తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం పొందనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ప్లాట్ల సంఖ్య 50 వేలకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.