LOADING...
Andhra Pradesh: ఉగాది కానుకగా ఏపీ పేదలకు లక్ష టిడ్కో ఇళ్లు.. అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన
అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన

Andhra Pradesh: ఉగాది కానుకగా ఏపీ పేదలకు లక్ష టిడ్కో ఇళ్లు.. అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. ఇల్లు లేని పేదలకు కొత్త ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉగాది రోజున లక్ష టిడ్కో ఇళ్లను పేదలకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో వెల్లడించారు. ఈ నెల 18న లక్ష మందికి ఇళ్లను అందజేయనున్నట్లు తెలిపారు.జూన్ నెల నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇందుకోసం హడ్కో సంస్థ నుంచి రూ.4,451 కోట్ల రుణం వచ్చినట్లు వివరించారు. అలాగే 2028 నాటికి పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు.

వివరాలు 

ఇళ్లు నిర్మించకుండానే బిల్లులు

అసెంబ్లీలో మున్సిపల్ శాఖ సాధారణ బడ్జెట్ డిమాండ్లపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి నారాయణ ఈ వివరాలు వెల్లడించారు. గతంలో ప్రభుత్వం 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ,వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంఖ్యను 2.65 లక్షలకు తగ్గించిందని మంత్రి విమర్శించారు. అంతేకాకుండా ఇళ్లకు రంగులు మార్చి, నిర్మాణం పూర్తికాకముందే బిల్లులు వేయడం ద్వారా భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల లబ్దిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే ప్రస్తుతం ప్రభుత్వం మళ్లీ ఆ పనులను ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రంలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోందని కూడా ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

పీఎం ఆవాస్ యోజన పథకం కింద లక్షల మంది దరఖాస్తు

ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో సుమారు 36 శాతం మంది పట్టణాల్లో నివసిస్తుండగా, 2047 నాటికి అది 60 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు. అందువల్ల పట్టణ ప్రాంతాల్లో అవసరమైన సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, ఇళ్లు, ఆరోగ్య సేవలు, చెత్త సేకరణ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించామని మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా,పీఎం ఆవాస్ యోజన పథకం కింద లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికి కూడా ఉగాది నాటికి ఇళ్లను కేటాయిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు.

Advertisement

వివరాలు 

వారికీ ఇళ్ల మంజూరు

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్లను అందిస్తామని ఆయన తెలిపారు. స్థలం లేని వారికి ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇచ్చి ఇళ్లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పీఎం ఆవాస్ యోజన పథకానికి లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వాటిని పరిశీలించి లబ్దిదారులను గుర్తించింది. ఇటీవల మరోసారి దరఖాస్తులను పునఃపరిశీలించి తుది జాబితాను సిద్ధం చేశారు. ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు సమాచారం. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల జాబితాను విడుదల చేయనుంది. పీఎం ఆవాస్ యోజన పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలకు ఇళ్ల నిర్మాణంలో సహాయం అందిస్తూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement