
Andhra Pradesh: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 25న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది వాయుగుండంగా మారే అవకాశముందని ప్రకటించారు. ఈ పరిణామాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం,ఈ నెల 27న ఏర్పడే వాయుగుండం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను తాకే అవకాశముంది. ఇక నేడు,రేపు ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని తెలిపింది.
వివరాలు
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
అలాగే గురువారం, శుక్రవారం రోజుల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక నేటి వర్షాల వివరాలు కూడా అధికారులు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.