LOADING...
Tirupati laddu row: కల్తీ నెయ్యి గుట్టు రట్టవగానే సంస్థ మాయాజాలం.. ఇతర కంపెనీల ద్వారా సరఫరా
కల్తీ నెయ్యి గుట్టు రట్టవగానే సంస్థ మాయాజాలం.. ఇతర కంపెనీల ద్వారా సరఫరా

Tirupati laddu row: కల్తీ నెయ్యి గుట్టు రట్టవగానే సంస్థ మాయాజాలం.. ఇతర కంపెనీల ద్వారా సరఫరా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2025
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల తిరుపతి దేవస్థానంకి (తితిదే) కల్తీ నెయ్యి సరఫరా జరిగిన విషయంలో సిట్‌ (SIT) విచారణలో విస్తృత స్థాయిలో మోసం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. తితిదేకు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ డెయిరీ (AR Dairy) జంతు కొవ్వు కలిసిన నెయ్యిని సరఫరా చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ స్కాంలో కీలక పాత్ర పోషించిన పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌లు తమ అక్రమ కార్యకలాపాలు బయటపడకుండా ఉండేందుకు వైష్ణవి డెయిరీ డైరెక్టర్‌ పదవులకు రాజీనామా చేశారు. వీరి స్థానంలో తమ డ్రైవర్లైన సురేంద్ర సింగ్, సౌరభ్‌ కశ్యప్‌లను డైరెక్టర్లుగా నియమించడంతోపాటు, తమ మొబైల్‌ ఫోన్లను నాశనం చేసి, విచారణలో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

వివరాలు 

తితిదే తిరస్కరించిన ట్యాంకర్లు నేరుగా వైష్ణవి డెయిరీకే 

ఆదివారం నలుగురిని అరెస్టు చేసిన సిట్‌ అధికారులు, వారి ప్రమేయం, కేసు వివరాలు న్యాయస్థానానికి రిమాండ్‌ రిపోర్టు ద్వారా సమర్పించారు. విచారణలో మరింత గమనార్హమైన అంశాలు వెల్లడయ్యాయి. ఏఆర్‌ డెయిరీ పేరిట సరఫరా చేసిన నెయ్యి అసలుగా ఆ సంస్థ తయారు చేసినదే కాదు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న భోలే బాబా ఆర్గానిక్‌ డెయిరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుండి ఈ నెయ్యిని తెచ్చి, తిరుపతి సమీపంలోని వైష్ణవి డెయిరీకి తరలించి, అక్కడ చిన్న ట్యాంకుల్లో నింపి, ఏఆర్‌ డెయిరీ తయారీ అన్నట్టుగా ముద్ర వేసి తితిదేకు సరఫరా చేశారు. ఈ సరఫరాకు తప్పుడు జీఎస్టీ ఇన్‌వాయిసులు, ల్యాబ్‌ రిపోర్టులు, వారంటీ సర్టిఫికెట్లు జత చేసి తితిదేను మోసం చేశారు.

వివరాలు 

అనర్హత వేటు.. ఏఆర్‌ డెయిరీ ముసుగులో చొరబాటు 

కానీ ఎన్‌డీడీబీ కాఫ్‌ ల్యాబ్‌ పరీక్షల్లో ఈ నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్లు తేలడంతో, తితిదే జూలై 25న ట్యాంకర్లను తిరస్కరించింది. అయితే అవి తిరిగి ఏఆర్‌ డెయిరీకి వెళ్లాల్సిన స్థలంలో తిరుపతి సమీపంలోని వైష్ణవి డెయిరీకి వెళ్లినట్లు గుర్తించారు. ఈ స్కాం 2019లోనే మొదలైంది. అప్పట్లో భోలే బాబా డెయిరీ తితిదేకు కిలో రూ. 291కు నెయ్యిని సరఫరా చేసేది. కానీ నాణ్యత లోపంతో 2022లో తితిదే వైష్ణవి డెయిరీ సరఫరాను నిలిపివేసింది.

వివరాలు 

వైష్ణవి డెయిరీలో వాటాలు ముందే కొనేసి.. 

దీంతో తితిదే టెండర్‌ను ఏదోవిధంగా దక్కించుకోవాలనుకున్న విపిన్‌ జైన్, పొమిల్‌ జైన్‌లు ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌ను సంప్రదించి, తమకే టెండర్‌ దక్కేలా చేయాలని, సరఫరా తామే చేస్తామని, కిలోకు రూ. 2.75 నుండి రూ. 3 వరకూ కమిషన్‌ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫైనాన్స్‌ లావాదేవీల్లో భోలే బాబా డెయిరీ నుండి ఏఆర్‌ డెయిరీ ఖాతాలకు డబ్బు జమ చేయడంతో, ఏఆర్‌ డెయిరీ తన పేరుతో తితిదేకు చెల్లించింది. ఇదంత మోసపూరితంగా జరిగింది.

వివరాలు 

శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకూ 'వైష్ణవి' నెయ్యే 

ఈ మోసంలో తితిదే అధికారుల ప్రమేయం ఉందా? అనే అంశంపై ఇప్పుడు సిట్‌ దృష్టి పెట్టింది. ఈ స్థాయి భారీ స్కాం అధికారుల సహకారంలేకుండా జరగడం అసాధ్యమని భావిస్తున్నారు. సోమవారం సిట్‌ బృందం దేహ్రాదూన్‌లోని పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్ నివాసాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకుంది. మరోవైపు శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు కూడా వైష్ణవి డెయిరీ నుంచే నెయ్యి సరఫరా కావడంతో అక్కడ కూడా ఈ స్కాం ప్రభావం ఉందా? అనే కోణంలో విచారణ జరిపే అవకాశముంది.