LOADING...
NITI Aayog: విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఏపీ టాప్‌.. నీతి ఆయోగ్‌ వెల్లడి
విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఏపీ టాప్‌.. నీతి ఆయోగ్‌ వెల్లడి

NITI Aayog: విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఏపీ టాప్‌.. నీతి ఆయోగ్‌ వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2025
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే అత్యధికమని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. 'ఇండియాలో ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ' అనే శీర్షికతో సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. 2016లో 46,818గా ఉన్న ఏపీ విద్యార్థుల సంఖ్య 2018 నాటికి 62,771కు చేరినట్లు తెలిపింది. అయితే కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో 2020లో ఈ సంఖ్య 35,614కు పడిపోయిందని పేర్కొంది. అయినప్పటికీ విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌నే మొదటి స్థానంలో ఉందని నివేదిక స్పష్టం చేసింది.

వివరాలు 

విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య 8.84 శాతం వృద్ధి నమోదు

ఏపీ తరువాతి స్థానాల్లో పంజాబ్‌,మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, దిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయని వివరించింది. 2024 నాటికి మొత్తం 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నట్లు అంచనా వేసింది. వీరిలో సుమారు 8.5 లక్షల మంది అమెరికా, యునైటెడ్‌ కింగ్డమ్‌, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోనే ఉన్నారని పేర్కొంది. 2016 నుంచి 2024 మధ్యకాలంలో విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య 8.84 శాతం వృద్ధి నమోదు చేసినట్లు నివేదికలో తెలిపింది. విదేశాల్లో చదువుల కోసం భారతీయ విద్యార్థులు ఏటా సుమారు రూ.6.2 లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నారని, ఈ మొత్తం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 2 శాతానికి సమానమని నీతి ఆయోగ్‌ వివరించింది.

వివరాలు 

వచ్చేది ఒకరు … వెళ్ళేది 28 మంది 

భారత వాణిజ్య లోటులో 75 శాతానికి కారణం విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు చేస్తున్న ఖర్చులేనని నివేదిక వెల్లడించింది. భారత్‌లో చదువుకోవడానికి విదేశాల నుంచి సగటున ఒక్క విద్యార్థి వస్తుంటే, అదే సమయంలో 28 మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లిపోతున్నారని పేర్కొంది. 2011 నుంచి ఇప్పటివరకు సుమారు 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని తెలిపింది. వీరిలో ఎక్కువ మంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినవారేనని అంచనా వేసింది. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని సూచించిన నీతి ఆయోగ్‌, విదేశీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో భారత విశ్వవిద్యాలయాల్లో చేరేలా ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది.

Advertisement

వివరాలు 

వచ్చేది ఒకరు … వెళ్ళేది 28 మంది 

2047 నాటికి దేశంలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను 7.89 లక్షలకు పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పటికి మొత్తం దేశీయ విద్యార్థుల సంఖ్యలో ఒక శాతానికి సమానంగా విదేశీ విద్యార్థులు ఉండేలా విధానాలు రూపొందించాలని సూచించింది. 2012-13 నుంచి 2021-22 మధ్యకాలంలో పంజాబ్‌లో మాత్రమే విదేశీ విద్యార్థుల సంఖ్య 300 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. అదే విధంగా ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోనూ గణనీయమైన వృద్ధి నమోదైనట్లు పేర్కొంది.

Advertisement

వివరాలు 

టాప్‌-10 జాబితా నుంచి బెంగాల్‌, తెలంగాణ 

విదేశీ విద్యార్థులను ఆకర్షించే విషయంలో పశ్చిమబెంగాల్, తెలంగాణలు టాప్‌-10 స్థానాన్ని కోల్పోయినట్లు నివేదిక వెల్లడించింది. కోల్‌కతా, హైదరాబాద్‌ నగరాల్లో అనేక ఉన్నత విద్యాసంస్థలు ఉన్నప్పటికీ, ఈ రెండు రాష్ట్రాలు అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడంలో వెనుకబడ్డాయని నివేదిక పేర్కొంది. భవిష్యత్తులో విదేశీ విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విధాన పరంగా 22 మార్పులు చేయాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసింది. దేశంలోని 24 రాష్ట్రాల్లో ఉన్న 160 ఉన్నత విద్యాసంస్థలు, అలాగే 16 దేశాల్లోని 30 విద్యాసంస్థలపై ఆన్‌లైన్‌ ద్వారా 100 ప్రశ్నలతో సర్వే నిర్వహించి ఈ నివేదికను సిద్ధం చేసినట్లు వెల్లడించింది.

Advertisement