Loading...
Andhra Pradesh: ఏపీకి నౌకా నిర్మాణ హబ్‌.. మూడు పోర్టుల్లో రూ.23 వేల కోట్ల పెట్టుబడులు
ఏపీకి నౌకా నిర్మాణ హబ్‌.. మూడు పోర్టుల్లో రూ.23 వేల కోట్ల పెట్టుబడులు

Andhra Pradesh: ఏపీకి నౌకా నిర్మాణ హబ్‌.. మూడు పోర్టుల్లో రూ.23 వేల కోట్ల పెట్టుబడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2026
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ను నౌకా నిర్మాణ రంగంలో కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను వేగవంతం చేస్తోంది. దుగరాజపట్నం,మచిలీపట్నం పోర్టుల్లో నౌకల తయారీ, మరమ్మతుల కేంద్రాల ఏర్పాటుకు మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌), గోవా షిప్‌యార్డు లిమిటెడ్‌ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ రెండు సంస్థలు కలిపి రూ.23వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. కాకినాడ గేట్‌వే పోర్టులోనూ ఇలాంటి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. ఈ మూడు పోర్టుల్లో మొత్తం 5,520 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏటా 2.9 మిలియన్‌ గ్రాస్‌ టన్నుల (ఎంజీటీ) నౌకా నిర్మాణ సామర్థ్యం అందుబాటులోకి రానుంది.

వివరాలు 

దుగరాజపట్నంలో రూ.15 వేల కోట్లతో ప్రాజెక్టు

ఎంజీటీ అనేది నౌక పరిమాణం, దాని మొత్తం సామర్థ్యాన్ని సూచించే కొలమానం.

దుగరాజపట్నంలో జాతీయ స్థాయి నౌకా నిర్మాణ కేంద్రంతో పాటు పోర్టు క్లస్టర్‌ను అభివృద్ధి చేసేందుకు మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చింది.

కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన షిప్‌బిల్డింగ్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కింద ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.

విద్యుత్‌, నీటి సరఫరా,అంతర్గత రహదారులు, డ్రైడాక్స్‌, గోదాముల నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుంది.

ప్రాజెక్టు పనుల అమలు, పర్యవేక్షణ కోసం విశాఖ పోర్టు అథారిటీ, ఏపీ మారిటైం బోర్డు సమాన భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది.

దీనికి 'నేషనల్‌ షిప్‌బిల్డింగ్‌, హెవీ ఇండస్ట్రీస్‌ పార్కు-ఏపీ' అని పేరు పెట్టింది.

వివరాలు 

2,170 ఎకరాల్లో నౌకా నిర్మాణ కేంద్రం

ఈ ప్రాజెక్టులో భాగంగా 2,170 ఎకరాల్లో నౌకా నిర్మాణ కేంద్రం, నౌకాశ్రయంతో పాటు అవసరమైన పారిశ్రామిక సదుపాయాలను ఎండీఎల్‌ అభివృద్ధి చేయనుంది.

నౌకల తయారీకి అవసరమైన యూనిట్లు, డ్రైడాక్స్‌, అలల ఉద్ధృతిని తగ్గించే బ్రేక్‌వాటర్లు, సరకు రవాణా, నిర్వహణకు కార్గో హ్యాండ్లింగ్‌ పోర్టు, ఉమ్మడి సరఫరా వ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానుంది.

నౌకల తయారీ, మరమ్మతులకు అవసరమైన స్టీల్‌ ప్లేట్లు, ఇంజిన్‌ విడిభాగాలు, పైపులు, విద్యుత్‌ పరికరాలు, కేబుల్స్‌ తయారు చేసే అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు మరో 1,350 ఎకరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు.

దీంతో నౌకా నిర్మాణానికి అవసరమైన విడిభాగాలను స్థానికంగానే తయారు చేసుకునే అవకాశం ఏర్పడనుంది.

ADVERTISEMENT

వివరాలు 

కాకినాడలో యూనిట్‌ ఏర్పాటుకు సంస్థ ఎంపిక

భారీ కంటైనర్‌ నౌకలు, కేప్‌సైజ్‌ నౌకలు,రక్షణ రంగానికి చెందిన నౌకలు సులభంగా రాకపోకలు సాగించేలా నావిగేషన్‌ ఛానల్‌, బెర్త్‌లను ఏర్పాటు చేయనున్నారు.

వీటి లోతు 16 నుంచి 18 మీటర్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 1.2 మిలియన్‌ గ్రాస్‌ టన్నుల నౌకా నిర్మాణ సామర్థ్యం అందుబాటులోకి రానుంది.

కాకినాడ గేట్‌వే పోర్టులో నౌకా నిర్మాణం,మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సంస్థను ఎంపిక చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఈ కేంద్రం ద్వారా నౌకల తయారీ,మరమ్మతులతో పాటు మెరైన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

నౌకల నిర్మాణంలో ఉపయోగించే యంత్రాలు, ప్రొపెలర్లు, ఇంజిన్లు,పైపులు,స్టీల్‌ విడిభాగాలను తయారు చేసే పరిశ్రమలను కూడా ఎంపికైన సంస్థ నిర్వహించనుంది.

ADVERTISEMENT

వివరాలు 

కాకినాడలో యూనిట్‌ ఏర్పాటుకు సంస్థ ఎంపిక

ఇందుకోసం 1,000 ఎకరాల్లో పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నారు.

కాకినాడ పోర్టు ప్రత్యేకత ఏమిటంటే.. భారీ నౌకలు రాకపోకలు సాగించేందుకు అనువుగా ఇక్కడ సహజంగానే 17 మీటర్ల లోతు ఉంది.

దీంతో సముద్రగర్భాన్ని లోతు చేయడానికి డ్రెడ్జింగ్‌ పనులు చేపట్టాల్సిన అవసరం ఉండదు.

అతిపెద్ద సరకు రవాణా నౌకలు, భారీ కంటైనర్‌ షిప్‌లు నేరుగా బెర్త్‌ల వద్దకు చేరుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు 

మచిలీపట్నంలో రూ.8 వేల కోట్ల పెట్టుబడి

మచిలీపట్నంలో 1,000 ఎకరాల విస్తీర్ణంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గోవా షిప్‌యార్డు లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ ప్రాజెక్టు కోసం ఆ సంస్థ రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. భారీ నౌకలు సులభంగా రాకపోకలు సాగించేందుకు 16 నుంచి 18 మీటర్ల లోతు ఉండేలా నావిగేషన్‌ ఛానల్‌, బెర్త్‌లను నిర్మించనున్నారు.

ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే ఏటా 0.5 మిలియన్‌ గ్రాస్‌ టన్నుల నౌకా నిర్మాణ సామర్థ్యం సమకూరనుంది.

ADVERTISEMENT