Andhra Pradesh Rains: ఏపీకి వర్ష సూచన.. నేడు కోస్తా, రాయలసీమలోని 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, ఏపీ తీరానికి సమీపంగా, సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
వివరాలు
పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల శాఖ హెచ్చరిక
విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చని పేర్కొన్నారు. అలాగే ఎల్లుండి (శుక్రవారం) నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు, పశువుల కాపరులు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరించారు. ఆకస్మిక వర్షాల సమయంలో చెట్ల కింద లేదా ఓపెన్ ప్రదేశాల్లో ఆశ్రయం పొందడం మానుకోవాలని ప్రజలను హెచ్చరించారు.