LOADING...
Andhra Pradesh: రాష్ట్రానికి 10.75 శాతం వృద్ధి.. రూ.20.36 లక్షల కోట్ల లక్ష్యం
రాష్ట్రానికి 10.75 శాతం వృద్ధి.. రూ.20.36 లక్షల కోట్ల లక్ష్యం

Andhra Pradesh: రాష్ట్రానికి 10.75 శాతం వృద్ధి.. రూ.20.36 లక్షల కోట్ల లక్ష్యం

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2026
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10.75 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఇది దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రణాళిక, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు. మొత్తం రూ.17.62 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తిని సాధించామని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పురోగతి రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలక సంకేతమని తెలిపారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో గురువారం స్థూల ఉత్పత్తిపై ఆయన వివరణ ఇచ్చారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.20.36 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 15.53 శాతం వృద్ధి సాధనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

వివరాలు 

మొదటి స్థానంలో  విశాఖ జిల్లా

ఈ లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేస్తూ,ప్రతి జిల్లాలో ఏ రంగాన్ని బలోపేతం చేయాలనే అంశాన్ని విశ్లేషిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 2047 స్వర్ణాంధ్ర దృష్టి లక్ష్యాలకు అనుసంధానంగా ప్రతి ఏడాది అభివృద్ధి లక్ష్యాలను సవరించుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల వారీగా చూసుకుంటే, రూ.1,61,009కోట్ల స్థూల ఉత్పత్తితో విశాఖ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్,కృష్ణా,తిరుపతి,ఏలూరు జిల్లాలు ఉన్నాయి.బాపట్ల జిల్లా రూ.46,440 కోట్ల ఉత్పత్తి విలువ సాధించినప్పటికీ, 19.19 శాతం వృద్ధితో అన్ని జిల్లాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక అన్నమయ్య,మార్కాపురం,అల్లూరి సీతారామరాజు,పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలు స్థూల ఉత్పత్తి పరంగా చివరి స్థానాల్లో నిలిచాయి. అన్నమయ్య జిల్లా వృద్ధి రేటు -1.35 శాతంగా నమోదైనట్లు సమావేశంలో ప్రస్తావించారు.

Advertisement