Andhra Pradesh: పునరుత్పాదక విద్యుత్ హబ్‌గా ఏపీ: నీతి ఆయోగ్ ముసాయిదా బ్లూప్రింట్
ఈ వార్తాకథనం ఏంటి
దేశాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో ముందుకు నడిపించే ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఒక సమగ్ర ముసాయిదా బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయనున్న మూడు ప్రధాన పునరుత్పాదక విద్యుత్ హబ్‌లలో ఒకటిగా ఏపీని అభివృద్ధి చేయాలన్న స్పష్టమైన దిశానిర్దేశం ఇందులో ఉంది. రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయమైన, తక్కువ ధరలతో పాటు పర్యావరణ హితమైన విద్యుత్‌ను అందించడమే ఈ బ్లూప్రింట్ ప్రధాన ఉద్దేశం. ఇటీవల సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను నీతి ఆయోగ్ సీఈఓ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం కలుసుకుని విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఈ ముసాయిదా ప్రణాళికను అందజేశారు. ఈ ఏడాది మార్చి నాటికి బ్లూప్రింట్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి కేంద్ర స్టీరింగ్ కమిటీకి సమర్పించనున్నారు.
వివరాలు
అదనంగా పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు
ప్రస్తుతం రాష్ట్రంలో వినియోగిస్తున్న మొత్తం విద్యుత్‌లో సుమారు 47 శాతం పునరుత్పాదక వనరుల నుంచే అందుతోంది. 2035 నాటికి రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు 35 గిగావాట్ల సోలార్, 12 గిగావాట్ల పవన విద్యుత్‌తో పాటు 60 గిగావాట్ అవర్ ఎనర్జీ స్టోరేజ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా విద్యుత్ ఎగుమతుల కోసం అదనంగా 30 గిగావాట్ల సోలార్, 25 నుంచి 30 గిగావాట్ల పవన విద్యుత్, అలాగే 10 నుంచి 12 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బ్లూప్రింట్‌లో ప్రతిపాదించారు.
వివరాలు
యూనిట్ విద్యుత్ ధర తగ్గింపే లక్ష్యం
2035 నాటికి యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం రూ.3.90 నుంచి రూ.4.00 మధ్యకు తగ్గే అవకాశముందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. అదే సమయంలో విద్యుత్ సరఫరా వ్యయం యూనిట్‌కు రూ.6లోపు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నది లక్ష్యం. దీనివల్ల గృహ వినియోగదారులు, రైతులు మాత్రమే కాకుండా పరిశ్రమలు కూడా గణనీయంగా లాభపడతాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థ అభివృద్ధికి సుమారు రూ.3.40లక్షల కోట్ల పెట్టుబడి అవసరం కాగా, దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్ ఎగుమతి కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు దాదాపు రూ.4.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
వివరాలు
విద్యుత్ నెట్‌వర్క్ బలోపేతం
ఈ పెట్టుబడుల్లో సుమారు 90శాతం ప్రైవేటు రంగం నుంచే రావచ్చని, వాటి ద్వారా రాష్ట్రంలో సుమారు 6లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని నీతి ఆయోగ్ అంచనా వేసింది. మౌలిక వసతుల అభివృద్ధి,సంస్కరణలలో భాగంగా 2035 నాటికి విద్యుత్ పంపిణీ రంగంలో సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని ముసాయిదాలో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్,జీఐఎస్ సబ్‌స్టేషన్లు,హెచ్‌వీడీఎస్ కారిడార్‌ల వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించి ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయనున్నారు.
వివరాలు
విద్యుత్ నెట్‌వర్క్ బలోపేతం
అదేవిధంగా, రూ.40 వేల కోట్ల పెట్టుబడితో విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడం, నష్టాలను తగ్గించడం, సరఫరా నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సోలార్ ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగానికి పగటిపూట విద్యుత్ సరఫరా చేయడం, తద్వారా ప్రభుత్వంపై ఉండే సబ్సిడీ భారాన్ని తగ్గించడమే ఈ ప్రణాళికలోని ముఖ్య ఉద్దేశమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.