Loading...
Andhra Pradesh: రాయలసీమలో రూ.5,217 కోట్ల పెట్టుబడులు.. 7,613 మందికి ఉద్యోగాలు
రాయలసీమలో రూ.5,217 కోట్ల పెట్టుబడులు.. 7,613 మందికి ఉద్యోగాలు

Andhra Pradesh: రాయలసీమలో రూ.5,217 కోట్ల పెట్టుబడులు.. 7,613 మందికి ఉద్యోగాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2026
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

రాయలసీమను పారిశ్రామిక తయారీ కేంద్రంగా, ప్రపంచస్థాయి ఉద్యానవన పంటల హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆటోమొబైల్ విడిభాగాలు, ఏరోస్పేస్, రక్షణ, ఉక్కు,ఆహారశుద్ధి, వస్త్రాలు,ఆతిథ్య రంగాల్లో మొత్తం రూ.5,217.39 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో 23 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా స్థానికంగా 7,613 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అనంతపురంలోని జేఎన్‌టీయూలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీ ఈడీబీ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ)సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ భాగస్వామ్య సదస్సు విజయవంతమైంది. నవంబరు 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 31వ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు ముందస్తు సన్నాహాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వివరాలు 

కుదిరిన ఒప్పందాలు ఇవీ..

ఈ సందర్భంగా అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో అందుబాటులో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, పెట్టుబడులకు అనువైన రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా కార్ల తయారీ కేంద్రం పరిసరాల్లో ఆటోమొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.

ఫోర్ వీలర్ విడిభాగాల తయారీ కోసం హ్వాసిన్ ఆటోమోటివ్ సంస్థ రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

ఆటోమొబైల్ ఇంటీరియర్ భాగాల తయారీకి సియోయాన్ సంస్థ రూ.514 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

మరోవైపు, కర్నూలులో ఇవామెట్ ఇండియా సంస్థ రూ.250 కోట్లతో ఆటోమొబైల్ విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.

వివరాలు 

కుదిరిన ఒప్పందాలు ఇవీ..

ఏరోస్పేస్, రక్షణ రంగాల్లోనూ భారీ పెట్టుబడులు రానున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 600 ఎకరాల్లో రూ.435.75 కోట్లతో డ్రోన్ సిటీ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

అజిస్తా కాంపోజిట్స్ సంస్థ రూ.810 కోట్లతో ఏరోస్పేస్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది.

రక్షణ పరికరాల తయారీ కోసం వీరా టాక్టికల్ డైనమిక్స్ సంస్థ రూ.165 కోట్లు, డ్రోన్ల తయారీకి స్టార్మింగ్ యూనివర్స్ సంస్థ రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.

శ్రీసత్యసాయి జిల్లా టేకులోడు ఏరోస్పేస్ పార్కులో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు సంబంధించి ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో రూ.2 వేల కోట్లతో ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది.

ADVERTISEMENT

వివరాలు 

కుదిరిన ఒప్పందాలు ఇవీ..

ఉక్కు పరిశ్రమల స్థాపనకు కూడా కంపెనీలు ఆసక్తి చూపించాయి. అనంతపురంలో హరిఓమ్ పైప్స్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.700 కోట్లతో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనుంది.

కర్నూలులో స్టెడ్ ఫాస్ట్ స్టీల్స్ సంస్థ రూ.536 కోట్ల పెట్టుబడితో ఉక్కు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

రాయలసీమలోని 10 జిల్లాలను అనుసంధానిస్తూ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌లో భాగంగా చిత్తూరులో నకోడా డెయిరీ సంస్థ రూ.340 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

ఉద్యానవన పంటల ఉత్పత్తుల ప్రాసెసింగ్, వాటి విలువను పెంచే కార్యకలాపాలకు ఈ తరహా పరిశ్రమలు తోడ్పడనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

కుదిరిన ఒప్పందాలు ఇవీ..

వస్త్ర పరిశ్రమల రంగంలోనూ కొత్త యూనిట్లు ఏర్పాటు కానున్నాయి.

శ్రీసత్యసాయి జిల్లాలో మహాజన్ టెక్స్‌టైల్స్, ఉన్నతి టెక్స్‌టైల్స్, లిటిల్ కింగ్ గ్లోబల్ స్పోర్ట్స్‌వేర్ సంస్థలు కలిపి రూ.115 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలను స్థాపించనున్నాయి.

పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనూ పెట్టుబడులు రానున్నాయి. అనంతపురంలో వై రిట్రీట్స్ సంస్థ రూ.75 కోట్లతో ఫోర్ స్టార్ హోటల్‌ను నిర్మించనుంది.

కడపలో సన్‌లార్క్ హాస్పిటాలిటీ సంస్థ రూ.56 కోట్లతో హోటల్‌ను ఏర్పాటు చేయనుంది.

వివరాలు 

70 శాతానికి పైగా ఒప్పందాలు అమల్లోకి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వివిధ కంపెనీలు కుదుర్చుకున్న పారిశ్రామిక ఒప్పందాల్లో 70 శాతానికి పైగా ఇప్పటికే అమలు దశలో ఉన్నాయని రాష్ట్ర ఆహారశుద్ధి శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు.

గత రెండేళ్లలో రాష్ట్రానికి రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని ఏపీఐఐసీ ఎండీ దినేష్ కుమార్ వెల్లడించారు.

వీటిలో రూ.16.16 లక్షల కోట్ల పెట్టుబడులు కేటాయింపుల స్థాయికి చేరుకున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఈడీబీ సీఈవో షాన్‌మోహన్, అనంతపురం జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్, సీఐఐ ఆంధ్రప్రదేశ్ వైస్ ఛైర్మన్ జి.సాంబశివరావు, జేఎన్‌టీయూ వీసీ సుదర్శనరావు పాల్గొన్నారు.

ADVERTISEMENT