Andhra Pradesh: ఉపాధి హామీ పనుల్లో లక్ష్యాన్ని అధిగమించిన ఆంధ్రప్రదేశ్
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో ఆంధ్రప్రదేశ్ మరోసారి ప్రతిభ కనబరిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పనిదినాల వినియోగం విషయంలో దేశవ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 15 కోట్ల పనిదినాలు కేటాయించగా, అక్టోబర్ 30 నాటికి 15.66 కోట్ల పనిదినాలను (104.48%) వినియోగించి లక్ష్యాన్ని మించిపోయింది. జాతీయస్థాయిలో మొదటి స్థానంలో పుదుచ్చేరి (163.20%), రెండో స్థానంలో రాజస్థాన్ (104.48%) నిలిచాయి. దేశంలోని సగానికి పైగా రాష్ట్రాలు మాత్రం మొదటి విడతలో కేటాయించిన పనిదినాల్లో 40-50 శాతం మాత్రమే వినియోగించగలిగాయి.
Details
ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్షా
ఆర్థిక సంవత్సరం ఆరునెలలు పూర్తయిన సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్ష జరిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ పనిదినాల వినియోగంలో మూడో స్థానంలో ఉందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఈ ఏడాది తొలి ఆరు నెలలకు కేంద్రం 198.85 కోట్ల పనిదినాలు కేటాయించగా, అక్టోబర్ 30 నాటికి వాటిలో 148.84 కోట్లు (65.39%) మాత్రమే వినియోగించారు. ఈ క్రమంలో తెలంగాణకు 6.50 కోట్లు కేటాయించగా 5.47 కోట్లు (84.16%), తమిళనాడుకు 12 కోట్లలో 9.68 కోట్లు (80.72%), కర్ణాటకకు 9 కోట్లలో 5.98 కోట్లు (66.51%), ఒడిశాకు 12 కోట్లలో 7.15 కోట్లు (59.64%) వినియోగించారు.
Details
గరిష్టంగా 5.91 కోట్ల పనిదినాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ నుండి ఇప్పటివరకు నెలవారీ సగటు కనిష్ఠంగా 2.80 కోట్లు, గరిష్ఠంగా 5.91 కోట్ల పనిదినాలు శ్రామికులకు కల్పించారు. వీటిలో ఏప్రిల్, మే నెలలు అత్యధిక పనిదినాల వినియోగం నమోదైంది. పనులకు హాజరైన వారిలో మహిళలే అధిక శాతం ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పనిదినాల వినియోగంలో అవకతవకలు, 'దొంగ మస్టర్లు' వేసి డేటాను పెంచారన్న విమర్శల నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంస్కరణల దిశగా పలు చర్యలు చేపట్టింది. విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి, ఆకస్మిక తనిఖీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది.
Details
అదనంగా మరో 3 కోట్ల పనిదినాలు
ఈ ఏడాది రెండో విడతగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ రాష్ట్రానికి మరిన్ని 3 కోట్ల పనిదినాలు అదనంగా కేటాయించింది. వీటితో సెప్టెంబర్ నుండి మార్చి నెలాఖరు వరకు మరింతమంది శ్రామికులకు ఉపాధి కల్పించనున్నారు. అదనంగా 9 కోట్ల పనిదినాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఆంధ్రప్రదేశ్ మొత్తం 24.22 కోట్ల పనిదినాలు ఖర్చు చేసింది. ప్రస్తుత అవసరాల మేరకు కేంద్రం మరో విడతలో కూడా అదనపు పనిదినాలు కేటాయించే అవకాశం ఉందని, ప్రస్తుతం 3 కోట్ల పనిదినాలు మంజూరు అయ్యాయి. అవసరమైతే మళ్లీ కేటాయిస్తారు. ఎలాంటి ఇబ్బంది లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారి తెలిపారు.