Andhra News: ఫ్లోరిడాలో అంతరిక్ష శిక్షణకు నిడదవోలు యువతి ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్న వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచల కైవల్యరెడ్డి ఎంపికయ్యారు. ప్రపంచంలోని 36దేశాల నుంచి వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం కేవలం 150మంది మాత్రమే శిక్షణకు అర్హులుగా గుర్తించగా,ఆ జాబితాలో కైవల్య ఉన్నారు. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ నీల్ ఎస్. లాచ్‌మన్ అధికారిక ఈమెయిల్ ద్వారా తెలియజేయడంతో కైవల్య కుటుంబంలో ఆనందం వెల్లువెత్తింది. చిన్నప్పటి నుంచే చదువుతో పాటు అంతరిక్ష విజ్ఞానం,గ్రహాలు,నక్షత్రాలు వంటి అంశాలపై ఆసక్తి పెంపొందించిన కైవల్య,రసాయన శాస్త్రం,భౌతిక శాస్త్రం,గణితంపై ప్రత్యేక దృష్టి పెట్టి తన లక్ష్యాన్ని సాధించే దిశగా క్రమంగా ప్రయాణిస్తూ,కేవలం 17 ఏళ్ల వయసులోనే ఈ అరుదైన అవకాశాన్ని కైవసం చేసుకున్నారు.
వివరాలు
2029లో అంతరిక్ష ప్రయాణం లక్ష్యం
ఈ శిక్షణ 2026 నుండి 2029 వరకు కొనసాగనుంది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ 2029 నాటికి అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే లక్ష్యంతో ఈ శిక్షణను ప్రారంభించింది. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన తరువాత, వ్యోమగాములు భూమికి 300 కి.మీ. పైన కక్ష్యలో సుమారు 5 గంటలపాటు కొనసాగే ప్రత్యేక మిషన్‌లో పాల్గొంటారు. ఇందులో భూమి చుట్టూ రెండు ఫేరీలు తిరుగుతారు. ఆ మిషన్‌లో మూడు గంటలపాటు జీరో గ్రావిటీని అనుభవించే అవకాశం ఉంటుంది. కైవల్యరెడ్డి తండ్రి కుంచల శ్రీనివాసరెడ్డి నిడదవోలు మండలం సమిశ్రగూడెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుండగా, తల్లి విజయలక్ష్మి గృహిణి. జర్మనీలోని LMU విశ్వవిద్యాలయంలో ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రానమీ చదివి, భవిష్యత్తులో ఖగోళ శాస్త్రవేత్తగా సేవలందించడం తన కల అని కైవల్య చెబుతున్నారు.