Micro Irrigation: మైక్రో ఇరిగేషన్‌లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూక్ష్మసేద్య విధానం అమల్లో దేశవ్యాప్తంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం మొత్తం 3.15 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఈ పథకం ద్వారా 1,08,143 మంది రైతులు లబ్ధి పొందారు. ఇతర రాష్ట్రాలైన గుజరాత్ (2.63 లక్షల ఎకరాలు), తమిళనాడు (2.62 లక్షల ఎకరాలు), రాజస్థాన్ (2.42 లక్షల ఎకరాలు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రంలో సూక్ష్మసేద్యం ద్వారా టమాటా, ఆయిల్‌పామ్, మిరప, మామిడి, బత్తాయి, అరటి, కొబ్బరి, దానిమ్మ, ఉల్లి, వేరుశనగ, మొక్కజొన్న, పత్తి, పప్పుధాన్యాలు వంటి పంటలను విస్తృతంగా సాగు చేశారు.
వివరాలు
చిన్న,సన్న రైతులకు రాష్ట్రం 90 శాతం రాయితీ
రాయితీల విషయానికి వస్తే, ఎస్సీ, ఎస్టీ రైతులకు కేంద్రం 55 శాతం సబ్సిడీ అందించగా, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 100 శాతానికి పెంచి అమలు చేసింది. చిన్న,సన్న రైతులకు కేంద్రం 55 శాతం రాయితీ ఇవ్వగా, రాష్ట్రం 90 శాతం వర్తింపజేసింది. ఇతర రైతుల విషయంలో కేంద్రం 45 శాతం రాయితీ ఇచ్చినప్పటికీ, రాష్ట్రంలో రాయలసీమ, ప్రకాశం జిల్లాల మధ్యతరగతి రైతులకు 90 శాతం, మిగతా జిల్లాల రైతులకు 70 శాతం వరకు సబ్సిడీ అందించారు. బిందు సేద్యం కింద 92,505 మంది రైతులకు 2.68 లక్షల ఎకరాల్లో పరికరాలు పంపిణీ చేశారు. అదేవిధంగా, 15,638 మంది రైతులకు 18,585 ఎకరాల్లో తుంపర సేద్య పరికరాలు అమర్చినట్లు ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు.