Loading...
Andhra Pradesh: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి ఆరు అవార్డులు.. విశాఖకు అగ్రస్థానం
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి ఆరు అవార్డులు.. విశాఖకు అగ్రస్థానం

Andhra Pradesh: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి ఆరు అవార్డులు.. విశాఖకు అగ్రస్థానం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025-26 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ సత్తా చాటింది. రాష్ట్రానికి మొత్తం ఆరు అవార్డులు దక్కాయి. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో విశాఖపట్నం దేశంలోనే తొలి ర్యాంకు సాధించింది. స్వచ్ఛ నగరాల లీగ్‌లో విజయవాడ మూడో స్థానంలో నిలిచింది. 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో గుంటూరు మూడో ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ ఏడాది తొలిసారిగా ప్రవేశపెట్టిన గురు-శిష్య (మెంటార్‌-మెంటీ) సిటీ విభాగంలో తిరుపతి, కుప్పం మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. రాష్ట్రస్థాయిలో రాజమహేంద్రవరం తొలి స్వచ్ఛ నగరంగా నిలిచింది.

వివరాలు 

విజేతలకు మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అవార్డులు

బుధవారం సాయంత్రం దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ విజేతలకు అవార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌, కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌ హాజరయ్యారు.

విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమహేంద్రవరం, తిరుపతి మున్సిపల్‌ కమిషనర్లు ధ్యానచంద్ర, కేతన్‌గర్గ్‌, మయూర్‌ అశోక్‌, రాహుల్‌ మీనా, జయకృష్ణ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు స్వీకరించారు.

వివరాలు 

నగరాల పనితీరును 10 అంశాల ప్రాతిపదికన అంచనా

పట్టణ స్థానిక సంస్థలు అందించిన వివరాలు, డెస్క్‌టాప్‌ మదింపు, స్వతంత్ర క్షేత్రస్థాయి తనిఖీలు, ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు.

నగరాల పనితీరును 10 అంశాల ప్రాతిపదికన అంచనా వేశారు. నివాస ప్రాంతాలు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు.

దేశవ్యాప్తంగా మొత్తం 4,751 పట్టణ స్థానిక సంస్థలు ఈ పోటీలో పాల్గొన్నాయి. వీటిలో వివిధ విభాగాల్లో తొలి మూడు స్థానాలు సాధించిన 63 సంస్థలకు రాష్ట్రపతి అవార్డులు అందజేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి: రాష్ట్రపతి

నగరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు.

స్వచ్ఛత విషయంలో ఆశించిన మార్పు రావాలంటే ప్రభుత్వ అధికారులు ప్రజలతో కలిసి పనిచేయాలని చెప్పారు.

తన ప్రజాజీవిత ప్రస్థానం కూడా పంచాయతీలో స్వచ్ఛత కార్యక్రమంతోనే ప్రారంభమైందని గుర్తుచేశారు.

ప్రజలు నివసించే ప్రాంతాలను ఎలా శుభ్రంగా ఉంచాలనే విషయంలో స్థానికులకే ఎక్కువ అవగాహన ఉంటుందని రాష్ట్రపతి పేర్కొన్నారు.

అందుకే వారి నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలని అన్నారు.

ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ పట్టణ స్థానిక సంస్థల పనితీరును మెరుగుపరచడమే కాకుండా, స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి: రాష్ట్రపతి

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ లక్ష్యాలను మరింత వేగంగా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే తరహాలో సర్వేలు నిర్వహించాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సూచించారు.

మెరుగైన పనితీరు కనబరిచిన మున్సిపాలిటీలను గుర్తించి అవార్డులు ప్రకటించాలని అన్నారు.

గవర్నర్లు, ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేస్తే మరింత ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

153 లక్షల టన్నుల చెత్త తొలగించాం: మంత్రి నారాయణ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైకాపా ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన 153 లక్షల టన్నుల చెత్తను తొలగించామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

ఇందులో తొలి ఏడాదిలోనే 85 లక్షల టన్నుల చెత్తను శుద్ధి చేసినట్లు వెల్లడించారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు అందుకున్న అనంతరం ఏపీ భవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

ప్రతి నెలా మూడో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వల్లే రాష్ట్రానికి ఆరు అవార్డులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను శుద్ధి చేసేందుకు 106 ప్లాంట్లకు అనుమతులు మంజూరు చేశామని, వీటిలో ఇప్పటికే 60 ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

వివరాలు 

2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం 

2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనాన్ని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని నారాయణ వివరించారు.

ఇందులో భాగంగా మున్సిపాలిటీల్లో ప్రతి ఐదు మీటర్లకు ఒక మొక్క నాటాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు.

పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మొత్తం రూ.50 వేల కోట్ల విలువైన పనులు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు.

ADVERTISEMENT