Loading...
Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల కింద అనామలీస్‌.. జీపీఆర్‌ పరీక్షలో సంచలన విషయాలు
కాళేశ్వరం బ్యారేజీల కింద అనామలీస్‌.. జీపీఆర్‌ పరీక్షలో సంచలన విషయాలు

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల కింద అనామలీస్‌.. జీపీఆర్‌ పరీక్షలో సంచలన విషయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై నిర్వహించిన గ్రౌండ్‌ పెనట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌) పరీక్షల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యారేజీల్లోని కొన్ని వెంట్స్‌ (నీరు వెళ్లే మార్గాలు) కింద భూగర్భంలో కేవిటీస్‌ (ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ కావడం), పెద్ద బోల్టర్లు, వెదర్‌ రాక్స్‌, రాళ్ల కింద పూడిక వంటి అసాధారణ పరిస్థితులు(అనామలీస్‌) ఉన్నట్లు పరీక్షలో గుర్తించారు. అత్యధికంగా మేడిగడ్డ బ్యారేజీలో ఏడు వెంట్స్‌ కింద సమస్యలు ఉన్నట్లు తేలగా, సుందిళ్ల బ్యారేజీలో మూడు వెంట్స్‌, అన్నారం బ్యారేజీలో ఒక వెంట్‌ కింద అనామలీస్‌ను గుర్తించారు. మిగిలిన వెంట్స్‌లో చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పటికీ, మూడు బ్యారేజీల్లో కలిపి 11 వెంట్స్‌ వద్ద ఎలాంటి అనామలీస్‌ కనిపించలేదని నివేదిక పేర్కొంది.

వివరాలు

ఏడో బ్లాక్‌ కింద అధిక సమస్యలు 

ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ కింద అత్యధిక సమస్యలు ఉన్నట్లు జీపీఆర్‌ పరీక్ష వెల్లడించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ మేరకు పుణెలోని కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) డైరెక్టర్‌ సెల్వబాలన్‌ రెండు రోజుల క్రితం నీటిపారుదల శాఖకు నివేదిక సమర్పించారు.

ఏ వెంట్‌ కింద, ర్యాఫ్ట్‌ దిగువన, వెంట్‌ మొత్తం భాగంలోనా, లేక ఎగువ లేదా దిగువ భాగంలోనా సమస్యలు ఉన్నాయో విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.

బ్యారేజీల దిగువన భూగర్భ పరిస్థితి ఎలా ఉందో, సీపేజీ మార్గాలేమైనా ఉన్నాయా, గుంతలు లేదా ఇతర విదేశీ పదార్థాలు (ఫారిన్‌ బాడీస్‌) ఉన్నాయా అనే అంశాలను గుర్తించేందుకు జీపీఆర్‌ పరీక్ష నిర్వహించారు.

వివరాలు

30 మీటర్ల లోతు వరకు అధ్యయనం

ఈ పరీక్ష ద్వారా బ్యారేజీల కింద 30 మీటర్ల లోతు వరకు భూగర్భాన్ని అధ్యయనం చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో మొత్తం 225 వెంట్స్‌ ఉండగా, వాటిలో 217 వెంట్స్‌ వద్ద జీపీఆర్‌ పరీక్షలు నిర్వహించారు.

మేడిగడ్డలో నాలుగు వెంట్స్‌ను పూర్తిగా, మరో మూడు వెంట్స్‌ను పాక్షికంగా పరీక్షించారు. సుందిళ్లలో ఒక వెంట్‌ మినహా మిగిలిన అన్నింటినీ పరిశీలించారు.

మొత్తంగా మూడు బ్యారేజీల కింద దాదాపు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

బ్యారేజీ ఎగువన క్రస్ట్‌, దిగువ భాగం, ర్యాఫ్ట్‌, దానికి అనుబంధంగా ఉన్న నిర్మాణాల కింద భూగర్భ పరిస్థితిని అంచనా వేయడమే ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

సమస్యలను గుర్తించిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్

నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీలో ఎనిమిదో బ్లాక్‌లోని ఏడో వెంట్‌ ఎగువ భాగంలో, ఐదో బ్లాక్‌లోని 35వ వెంట్‌, ఏడో బ్లాక్‌లోని 17, 18, 19, 20, 21 వెంట్ల వద్ద అనామలీస్‌ గుర్తించారు.

అన్నారం బ్యారేజీలో ఐదో బ్లాక్‌లోని 47వ వెంట్‌ ఎగువ భాగంలో సమస్యలు గుర్తించగా, సుందిళ్ల బ్యారేజీలో రెండో బ్లాక్‌లోని 25వ వెంట్‌, మూడో బ్లాక్‌లోని 31వ వెంట్‌, ఐదో బ్లాక్‌లోని 53వ వెంట్‌ల ఎగువ, దిగువ భాగాల్లో కూడా అనామలీస్‌ ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

ప్రతి వెంట్‌ వద్ద ఎన్ని ప్రాంతాల్లో, ఎంత లోతులో సమస్యలు ఉన్నాయో కూడా సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ గుర్తించింది.

మేడిగడ్డ బ్యారేజీ దిగువ భాగంలో జోన్లవారీగా అనామలీస్‌ ఎంత లోతులో ఉన్నాయో నివేదికలో వివరించారు.

ADVERTISEMENT

వివరాలు

ఇసుక జారిపోవడం వల్ల సమస్యలు

కొన్ని ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం, ఇసుక జారిపోవడం వల్ల ఈ సమస్యలు ఏర్పడినట్లు పేర్కొన్నట్లు సమాచారం.

ఆరు వెంట్స్‌ పరిధిలో మొత్తం పది అనామలీస్‌ జోన్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితుల వల్ల ర్యాఫ్ట్‌ కింద వాయిడ్స్‌ (శూన్య ప్రాంతాలు) ఏర్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఇలాంటి ప్రాంతాలు భవిష్యత్తులో సీపేజీ, పైపింగ్‌ వంటి సమస్యలు ఏర్పడేందుకు అనుకూలంగా ఉంటాయని హెచ్చరించారు.

ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని 17వ వెంట్‌ వద్ద ర్యాఫ్ట్‌ దిగువన 84.4 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు భిన్నమైన జోన్‌ను గుర్తించినట్లు నివేదికలో నమోదు చేశారు.

అయితే, జీపీఆర్‌ పరీక్షలు కేవలం భూగర్భ పరిస్థితిని అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగపడతాయన్నారు.

వివరాలు

తుది నిర్ధారణ చేయలేం

, నిర్మాణంలో లోపాలున్నాయని ఈ పరీక్షల ఆధారంగా తుది నిర్ధారణ చేయలేమని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది.

పునరుద్ధరణ పనులు చేపట్టే ముందు తప్పనిసరిగా మరిన్ని ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

అందులో భాగంగా బోర్‌హోల్‌ అండ్‌ కోర్‌ డ్రిల్లింగ్‌, ఎలక్ట్రికల్‌ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్‌టీ) వంటి పరీక్షలు చేయాలని సూచించగా, ఈ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, వాటి ఫలితాల ద్వారా నిర్మాణాల అసలు పరిస్థితి మరింత స్పష్టంగా తెలుస్తుందని సంబంధిత ఇంజినీర్లు తెలిపారు.

ప్రారంభ దశలో తగిన భూగర్భ అన్వేషణ పరీక్షలు నిర్వహించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలను అప్పట్లో గుర్తించలేకపోయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ADVERTISEMENT