Jana Sena Party : పవన్ అభిమానులకు మరో సైబర్ షాక్.. హ్యాకర్ల చేతిలోకి జనసేన ట్విటర్!
ఈ వార్తాకథనం ఏంటి
రాజకీయ నాయకులు, ప్రముఖులు, పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ బారినపడటం కొత్తేమీ కాదు. అయితే తాజాగా జనసేన పార్టీ అధికారిక ట్విటర్ (ప్రస్తుత ఎక్స్) ఖాతా సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ సమావేశాలు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ప్రకటనలు మాత్రమే కనిపించే ఆ ఖాతాలో ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్‌లకు సంబంధించిన రీట్వీట్లు దర్శనమివ్వడంతో ఫాలోవర్లు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే జనసేన నాయకత్వం అప్రమత్తమైంది. వెంటనే సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Details
అత్యవసర చర్యలు చేపట్టిన సాంకేతిక బృందం
ఖాతాను తిరిగి పొందేందుకు సాంకేతిక బృందం అత్యవసర చర్యలు ప్రారంభించింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జనసేన పార్టీ ట్విటర్ ఖాతా పూర్తిగా హ్యాకర్ల నియంత్రణలోనే ఉన్నట్లు తెలిసింది. ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ పోస్టులతో నిండిన జనసేన హ్యాండిల్‌ను చూసి పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రాజకీయ పోస్టులు కనిపించే ఆ ఖాతా హ్యాక్ కావడం వారిని షాక్‌కు గురిచేసింది. ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఎన్నికల సమయంలో కూడా జనసేన అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేయబడింది.
Details
"జనసేన" నుంచి "మైక్రో స్ట్రాటజీ"గా మార్పు
ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సభలు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను హ్యాకర్లు తొలగించి, వాటి స్థానంలో బిట్‌కాయిన్ ప్రమోషన్ వీడియోలను అప్లోడ్ చేశారు. అంతేకాక, ఛానల్ పేరును "జనసేన" నుంచి "మైక్రో స్ట్రాటజీ"గా మార్చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారిక ట్విటర్ ఖాతా హ్యాక్ కావడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.