Loading...
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3, 4 తేదీల్లో అతి భారీ వర్షాలు!
ఏపీకి మరో తుపాను ముప్పు.. 3, 4 తేదీల్లో అతి భారీ వర్షాలు!

AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3, 4 తేదీల్లో అతి భారీ వర్షాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2026
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వైపు కదులుతోంది. రానున్న గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. నవంబర్ 2 నాటికి తీవ్ర తుపానుగా బలపడి.. నవంబర్ 3 తెల్లవారుజామున దక్షిణ కోస్తా తీరానికి సమీపంలోకి చేరుకునే అవకాశముందని తాజాగా వెల్లడించింది.

వివరాలు

తుపానుగా బలపడనున్న వాయుగుండం

నవంబర్ 1 తెల్లవారుజామున ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం గత ఆరు గంటల్లో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలింది.

నవంబర్ 1 మధ్యాహ్నానికి ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అదే రోజు అర్ధరాత్రి నాటికి తుపానుగా మారవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

నవంబర్ 2న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ తుపాను తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని తెలిపారు.

నవంబర్ 3 తెల్లవారుజామున నెల్లూరు నుంచి నరసాపురం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తీవ్ర తుపానుగా దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

వివరాలు

గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు

తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అప్పుడప్పుడు గాలుల వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉందని తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు

దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన

తుపాను ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజులు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ముఖ్యంగా నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ హెచ్చరించింది.

రాయలసీమ ప్రాంతంలోనూ నవంబర్ 2, 3 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే ప్రమాదం ఉందని, బలమైన ఈదురుగాలులు కూడా వీచవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు

తుపాను ముప్పు నేపథ్యంలో అధికారులు మత్స్యకారులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపారు.

అధికారులు జారీ చేసే సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రజలకు సూచించారు.

ADVERTISEMENT