Loading...
Big Rain Alert: ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు.. సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు.. సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Big Rain Alert: ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు.. సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2026
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న కొన్ని గంటల్లో మరింత బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. అనంతరం మరింత బలపడి సోమవారం నాటికి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందవచ్చని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు.

వివరాలు

ఏపీకి భారీ వర్ష సూచన

తుఫాన్‌ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

తీరం వెంబడి గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని సూచించారు.

వివరాలు

సహాయక చర్యలకు ప్రభుత్వ సన్నద్ధత

తుఫాన్‌ ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.

ప్రమాదకర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

విపత్తు నిర్వహణ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT