Telangana Elections: తెలంగాణలో మరో ఎన్నికల సందడి.. ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి ముగిసింది. మూడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికలు హోరాహోరీగా సాగగా, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధించారు. అయితే బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 1205 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా ఖరారవ్వగా, మిగిలిన 11,497 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 1,25,23,137 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 85.360గా నమోదైంది. ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 7,010 స్థానాలు దక్కించుకోగా, బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు 3,502 స్థానాల్లో గెలుపొందారు. ఇక బీజేపీ 688 సర్పంచ్ స్థానాలను సొంతం చేసుకుంది.
Details
ఎంపీటీసీ ఎన్నికలపై ఉత్కంఠ
సర్పంచ్ ఎన్నికలు పూర్తికావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పడింది. ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల సమగ్ర సవరణ జాబితా సిద్ధం చేయాల్సి ఉండటంతో ఈ ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతోంది. వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర సవరణ జాబితాను విడుదల చేసే అవకాశముందని సమాచారం. ఆ జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, న్యాయపరమైన అడ్డంకుల కారణంగా అవి వాయిదా పడ్డాయి. ఓటర్ల సవరణ జాబితా విడుదలైన తర్వాత ఈ ఎన్నికలను చేపట్టనున్నారు.
Details
ఫిబ్రవరిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
ఈ కారణాల నేపథ్యంలో జనవరి చివరి నాటికి ఎన్నికలు జరగడం కష్టమేనని తెలుస్తోంది. ఇక ఫిబ్రవరిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే మున్సిపల్ వార్డుల విభజనకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇంకా ఎన్నికల సంఘానికి అందించలేదు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాతే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఫిబ్రవరిలో మిగిలిన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ ఉత్సాహంగా ఉండగా, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.