Andhra Pradesh: ఏపీకి మరో బంగారు జాక్‌పాట్.. సీఎం సొంత జిల్లాలో 12.5 టన్నుల బంగారం నిక్షేపాల గుర్తింపు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ 'బంగారు' అవకాశం దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖనిజ సంపద వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభమైన నేపథ్యంలో, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ గనులను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (APMDC) ద్వారానే అభివృద్ధి చేసి బంగారం వెలికితీయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
వివరాలు
22 లక్షల టన్నుల బంగారు ఖనిజం..
చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చిగురుగుంట-బి.సానత్తం ప్రాంతంలోని గనుల్లో సుమారు 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
నిపుణుల లెక్కల ప్రకారం ఒక టన్ను ఖనిజాన్ని శుద్ధి చేస్తే సగటున 5.64 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉంది.
ఈ లెక్కన మొత్తం ఖనిజం నుంచి సుమారు 12,500 కిలోలు (12.5 టన్నులు) బంగారం వెలికితీయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
ఏపీఎండీసీకే గనులు దక్కేలా సీఎం ఆదేశాలు
ఈ గనులు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీకే దక్కేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
దీంతో ఈ గనుల కోసం నిర్వహించే ఈ-వేలంలో పాల్గొనేందుకు ఏపీఎండీసీ సిద్ధమవుతోంది.
ఇందుకోసం రూ.37 కోట్ల బ్యాంకు గ్యారెంటీని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జులై నెలాఖరులోగా బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
వివరాలు
వేలం లేకుండానే కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్న ఏపీ
మరోవైపు, ఈ గనులను వేలం ప్రక్రియ లేకుండానే నేరుగా ఏపీఎండీసీకి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇటీవల తెలంగాణలోని సింగరేణికి రెండు బొగ్గు గనులు, అలాగే ఒడిశాలో బాక్సైట్ లీజును కేంద్రం వేలం నిర్వహించకుండా కేటాయించిన విషయాన్ని ఉదాహరణగా చూపిస్తూ, అదే విధానంలో చిగురుగుంటతో పాటు రామగిరి, రొద్దం, జవకుల గనులను కూడా ఏపీఎండీసీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించనుంది.
వివరాలు
గతంలో మూతపడిన గనులు.. ఇప్పుడు మరో అవకాశం
గతంలో ఈ ప్రాంతంలో బంగారు గనుల తవ్వకాలు జరిగినప్పటికీ, రవాణా వ్యయాలు పెరగడం, అప్పట్లో బంగారం ధరలు తక్కువగా ఉండటంతో 2000 సంవత్సరంలో గనులను మూసివేశారు.
అనంతరం 2018లో జరిగిన వేలంలో ఎన్‌ఎండీసీ (NMDC) ఈ గనులను దక్కించుకున్నప్పటికీ, న్యాయపరమైన వివాదాల కారణంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోయింది.
చివరకు ఎన్‌ఎండీసీ వెనక్కి తగ్గడంతో ఇప్పుడు ఈ గనులను సొంతం చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లభించింది.
వివరాలు
వేలంలో గనులు దక్కితే సంయుక్తంగా తవ్వకాల యోచన
ఈ-వేలంలో గనులు దక్కితే మరో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుని బంగారు గనుల తవ్వకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే రాష్ట్ర ఖనిజ రంగానికి కొత్త ఊపు రావడంతో పాటు, ఆర్థికాభివృద్ధికి కూడా గణనీయమైన తోడ్పాటు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.