Indian Railways: రైల్వేలో మరో గ్రీన్ టెక్నాలజీ.. సౌరశక్తితో నడిచే కోచ్‌ను అందుబాటులోకి తెచ్చిన భారతీయ రైల్వే
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రైల్వే సాంకేతికతలో ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల హైడ్రోజన్ రైలును పరిచయం చేసిన రైల్వే శాఖ.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేస్తూ సౌరశక్తితో పనిచేసే రైలు కోచ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక కోచ్‌కు విద్యుత్ అవసరాలను పూర్తిగా సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే సౌరశక్తితోనే తీర్చనున్నారు. దీంతో బయటి విద్యుత్ సరఫరాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
వివరాలు
క్లీనర్, గ్రీనర్ రైల్వే దిశగా అడుగు
పర్యావరణహిత రవాణాను ప్రోత్సహిస్తూ 'క్లీనర్-గ్రీనర్ ట్రాన్స్‌పోర్టేషన్' లక్ష్యంతో నార్త్ సెంట్రల్ రైల్వే ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ పైలట్ ప్రాజెక్టును ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభించారు.
ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, దేశవ్యాప్తంగా మరిన్ని రైళ్లలో సౌరశక్తి కోచ్‌లను ప్రవేశపెట్టే యోచనలో రైల్వే శాఖ ఉంది.
దశలవారీగా విస్తరణ
పైలట్ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన అనంతరం సోలార్ కోచ్‌ల సంఖ్యను దశలవారీగా పెంచడం రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ సుస్థిర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న దిశగా భారతీయ రైల్వే ఈ కీలక చర్య చేపట్టింది.