Andhra Pradesh: ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం… తొలి విమానం ల్యాండింగ్‌కు ముహుర్తం ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ నేపథ్యంలో 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనుంది. ఈ ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రయాణించనున్నారు.
Details
ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ అనుసంధానం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతర్జాతీయ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడనుంది. దీని ఫలితంగా పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధిలో ఇది ఒక కీలక మలుపుగా మారుతుందని, భోగాపురం ప్రాజెక్ట్ రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Details
తుది దశలో నిర్మాణ పనులు
ఇదిలా ఉండగా, భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రన్‌వేలు, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC), భద్రతా వ్యవస్థలు వంటి కీలక మౌలిక సదుపాయాల పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. ఈ పనుల పురోగతిని బట్టి ఈనెల 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి విమానాయన శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో ఉన్నారు. రెండు దశల్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం భోగాపురం విమానాశ్రయాన్ని రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు.
Details
మొదటి దశలో రూ.4,592 కోట్ల వ్యయంతో
22 ఏరో బ్రిడ్జ్‌లు, 81,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ బిల్డింగ్, మొత్తం 2,203 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయ అభివృద్ధి చేపడతారు. అదనపు అవసరాల కోసం ప్రభుత్వం మరో 500 ఎకరాల భూమిని కేటాయించింది. ఒక్కొక్కటి 3.8 కిలోమీటర్ల పొడవుతో రెండు రన్‌వేలు నిర్మిస్తున్నారు. రెండో దశ పనులు అనంతరం ప్రారంభం కానున్నాయి.
Details
మే 2026 నుంచి విమాన సర్వీసులు లక్ష్యం
2026 మే నెల నుంచి విమాన రాకపోకలు ప్రారంభించేలా పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే జనవరిలో టెస్టింగ్ ఫ్లైట్ నిర్వహించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత కీలకంగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.