Covid : ఏపీలో మరో 6 కరోనా కేసులు.. ప్రభుత్వం అలర్ట్.. కీలక సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా కొత్త కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తాజాగా బుధవారం మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో విశాఖపట్నంలో మూడు, రాజమహేంద్రవరంలో మూడు కేసులు గుర్తించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32కు చేరింది. ఇదిలా ఉండగా, కడప జిల్లాలో సేకరించిన నమూనాలను పరీక్షించిన పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) ప్రయోగశాల.. వాటిలో ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్-5 వేరియంట్ ఉన్నట్లు నిర్ధారించింది. ఈ పరిణామాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని రాష్ట్రంలోని కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
వివరాలు
కడప జిల్లాలో అత్యధికంగా ఎనిమిది కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వీరపాండియన్ అధికారులను ఆదేశించారు.
గతంలో కరోనా సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే కడప జిల్లాలో అత్యధికంగా ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి.
గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆరు చొప్పున కేసులు ఉండగా, విశాఖపట్నంలో మూడు కేసులు నమోదయ్యాయి.
కాకినాడ, బాపట్ల జిల్లాల్లో రెండు చొప్పున కేసులు ఉన్నాయి. పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదుైంది.
వివరాలు
కరోనా కారణంగా నలుగురు మృతి
ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే, వారికి కరోనా నిర్ధారణకు ముందే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కొంతమంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు, చికిత్స కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు.
వివరాలు
17 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 255 ప్రత్యేక వార్డులు
ప్రజలు కరోనా విషయంలో అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, అయితే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు.
జ్వరం, దగ్గు, జలుబు వంటి స్వల్ప లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 255 ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు.
అలాగే మాస్కులు, ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు, చికిత్సకు అవసరమైన మందుల నిల్వలను అందుబాటులో ఉంచారు.
టెస్టింగ్ కిట్లు, రెమ్‌డెసివిర్ ఔషధాన్ని స్థానికంగానే కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇచ్చారు.
అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వైద్య సామగ్రిని వెంటనే కొనుగోలు చేసే అధికారాలను ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ప్రభుత్వం కల్పించింది.