చంద్రబాబుకే ఎందుకు ఇలా జరుగుతోంది? మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మృతి
చంద్రబాబు సభల్లో వరుస విషాదాలు టీడీపీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కొత్త ఏడాదిలో మొదటి రోజు గుంటూరు వికాస్‌నగర్‌లో జరిగిన తొక్కిసలాటలో మరో ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురూ మహిళలే. ఇటీవల కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 8మంది మృతి చెందిన విషయం తెలిసిందే. నూతన సంవత్సరం వేళ.. వికాస్‌నగర్‌లోని ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. చంద్రాబాబు కార్యక్రమాన్ని ప్రారంభించి.. ప్రసంగించి వెళ్లిపోయారు. అనంతరం తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోగా.. మరికొంత మంది గాయపడ్డారు.
ప్రమాదంపై ఎస్పీ వివరణ..
టీడీపీ కార్యక్రమాల్లో జరుగుతున్నఈ వరుస ప్రమాదాలతో చంద్రబాబు అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. తన సభల్లో ఇలా ఎందుకు జరుగుతుందనే బాధలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఇక మీదట పార్టీ కార్యక్రమాలు నిర్వహించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ద్వితీయ శ్రేణి నాయకులను చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే గుంటూరు ప్రమాదంపై పోలీసుల స్పందించారు. ఎక్కువ సేపు క్యూలో నిలబెట్టడం వల్ల.. జనం ఒక్కసారిగా రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. తాము అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే మొదటి కౌంటర్ వద్దే ఈ తొక్కిసలాట జరిగనట్లు వివరించారు.