అదానీ బొగ్గు కుంభకోణం వల్లే విద్యుత్ ధరలు పెరిగాయ్: రాహుల్ గాంధీ విమర్శలు
అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతులను ఓవర్ ఇన్‌వాయిస్ చేసిందని, దీంతో విద్యుత్ ధరలు పెరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. ఈ ప్రక్రియలో అదానీ గ్రూప్ మొత్తం రూ.32,000 కోట్లను లూఠీ చేసిందని రాహల్ అన్నారు. దిల్లీలోని విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. అదానీ గ్రూప్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గౌతమ్ అదానీ ఇండోనేషియాలో బొగ్గును కొంటారని, అది భారతదేశానికి చేరుకునే సమయానికి దాని ధర రెట్టింపు అవుతుందన్నారు. ఈ వ్యవహారంలో అదానీ గ్రూప్ దేశంలోని పేద ప్రజల జేబుల నుంచి సుమారు రూ. 32,000 కోట్లను దోచుకుందన్నారు. ఇంత మోసం జరిగినా.. అదానీని ప్రధాని మోదీనే కాపాడుతున్నారన్నారు.
మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే విద్యుత్ సబ్సిడీ: రాహుల్
ఇంతకుముందు ఈ బొగ్గుకుంభ కోణం రూ.20 వేల కోట్లు అనుకున్నామని, ఇప్పుడు మరో రూ.12వేల కోట్లు కలిపి రూ.32 వేల కోట్లు అవుతుందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు సబ్సిడీని ఇచ్చిందని రాహుల్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో కూడా సబ్సిడీని అమలు చేస్తామని పేర్కొన్నారు. అదానీ కుంభకోణం వల్లే కరెంటు బిల్లులు పెరుగుతున్నాయన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రఖ్యాత బ్రిటిష్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ అదానీ బొగ్గు కుంభకోణంపై కథనాన్ని ప్రచురించిందన్నారు. దీనిపై దేశంలో ఎలాంటి చర్చ జరగడం లేదన్నారు. అదానీ పేదల ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని, ఇది ప్రత్యక్ష దొంగతనంగా రాహుల్ అభివర్ణించారు.