AP 12th PRC: ఏపీ ఉద్యోగులకు అలర్ట్.. 12వ పీఆర్సీ మార్గదర్శకాలు విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి ఏయే అంశాలను పరిశీలించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ విధివిధానాలపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను తెలియజేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది. ఈలోగా అందిన ప్రతిపాదనలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేసిన తర్వాత పీఆర్సీ కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించనుంది. దీంతో ఉద్యోగులు తమ సమస్యలు, డిమాండ్లను కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కలగనుంది.
వివరాలు
ఎవరెవరికి పీఆర్సీ వర్తించదు?
12వ పీఆర్సీ పరిధికి సంబంధించి ప్రభుత్వం కొన్ని వర్గాలకు మినహాయింపు ఇచ్చింది.
యూజీసీ (UGC), ఎన్సీటీఈ (NCTE), బార్ కౌన్సిల్ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులకు ఈ వేతన సవరణ వర్తించదు.
అలాగే జాతీయ న్యాయ వేతన సంఘం పరిధిలోకి వచ్చే న్యాయాధికారులు కూడా ఈ పీఆర్సీ పరిధిలోకి రారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల్లో పనిచేసే సిబ్బంది, ఎయిడెడ్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది, శాశ్వత కంటింజెంట్ ఉద్యోగుల వేతనాలు, సర్వీస్ నిబంధనలను కమిషన్ పరిశీలించనుంది.
వివరాలు
డీఏ విలీనం.. కొత్త పే స్కేళ్లపై అధ్యయనం
ప్రస్తుతం ఉద్యోగులకు అందుతున్న కరవు భత్యం (డీఏ)ను మూలవేతనంలో ఎంత మేరకు విలీనం చేయాలనే అంశంపై కమిషన్ అధ్యయనం చేయనుంది.
ఈ పరిశీలన ఆధారంగా కొత్త వేతన స్కేళ్లను ఖరారు చేయనుంది.
ఉద్యోగులకు అమలవుతున్న ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌లో ఎదురవుతున్న సమస్యలను కూడా పరిశీలించనుంది.
ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలా? లేక అవసరమైన మార్పులు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వానికి సిఫారసులు అందించనుంది.
వివరాలు
అలవెన్సులు, పెన్షన్లపైనా సమీక్ష
స్పెషల్ పే, ఇతర అలవెన్సుల చెల్లింపులకు సంబంధించిన నిబంధనలను కూడా పీఆర్సీ కమిషన్ సమీక్షించనుంది.
అదేవిధంగా ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్షన్ విధానాన్ని పరిశీలించి, పెన్షనర్లకు సంబంధించిన అంశాలపై సిఫారసులు చేయనుంది.
ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను గ్రేడెడ్ విధానంలోకి మార్చే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనుంది.
కాంట్రాక్ట్, డిప్యుటేషన్ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను పరిశీలించడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంతమంది సిబ్బంది అవసరమనే విషయాన్ని అంచనా వేయనుంది.
వివరాలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా సిఫారసులు
12వ పీఆర్సీకి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి సిఫారసులు రూపొందించే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు విడుదల చేసిన మార్గదర్శకాలపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు డిసెంబర్ 31లోగా తమ సూచనలు, అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది.
అందిన ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాతే కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.