Andhrapradesh: ఇష్టానుసారంగా 22ఏ జాబితాలో భూముల నమోదు ఇక కుదరదు
ఈ వార్తాకథనం ఏంటి
భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22ఏ)లో అధికారులు తమ ఇష్టానుసారం చేర్చే అవకాశం ఇక ఉండదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఏ భూమినైనా 22ఏ పరిధిలోకి తీసుకురావాలంటే ముందుగా సంబంధిత భూ యజమానికి నోటీసులు జారీ చేయడం, వివరణ కోరడం, అవసరమైన విచారణ నిర్వహించడం తప్పనిసరి అని తెలిపారు. ఒక అధికారి తీసుకున్న తప్పు నిర్ణయం వల్ల భూ యజమాని హక్కులు దెబ్బతింటే, అందుకు ఆ అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 22ఏ భూముల సమస్యల కారణంగా భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు.
వివరాలు
అధికారికంగా జీవో జారీ..
ఈ నూతన నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.
రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22ఏ కింద గతంలో జారీ చేసిన అన్ని సర్క్యులర్లు, సూచనలు, వివరణలు, మార్గదర్శకాలు ఈ ఉత్తర్వులతో రద్దు అవుతాయని పేర్కొన్నారు.
కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 90 రోజుల్లోపు ఐజీఆర్‌ఎస్, సీసీఎల్‌ఏతో పాటు సంబంధిత శాఖలు తమ సాఫ్ట్‌వేర్ వ్యవస్థల్లో అవసరమైన మార్పులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ మేరకు ప్రభుత్వం బుధవారం అధికారికంగా జీవో జారీ చేసింది. సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించిన ముఖ్యాంశాలు ఇవి.
వివరాలు
వ్యవసాయ భూములకు వెబ్‌ల్యాండ్ 2.0 మాత్రమే..
నిషేధిత ఆస్తుల వివరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ (ఐజీఆర్‌ఎస్) వద్ద ఒకే కేంద్రీకృత డేటాబేస్ నిర్వహిస్తారు.
అధికారులు స్వేచ్ఛగా భూములను 22ఏ జాబితాలో చేర్చే అవకాశం ఉండదు.
వ్యవసాయ భూముల నమోదుకు వెబ్‌ల్యాండ్ 2.0 వ్యవస్థనే ఉపయోగిస్తారు.
మాన్యువల్ ఎంట్రీలకు అవకాశం ఉండదు. వెబ్‌ల్యాండ్‌లో ఏపీఐఐసీ, ఏపీ మారిటైమ్ బోర్డు పేర్లతో కొత్త భూ వర్గీకరణలను ప్రవేశపెడతారు.
సీలింగ్ సర్‌ప్లస్ భూముల వివరాలను ఐజీఆర్‌ఎస్ డేటాబేస్‌లో నమోదు చేస్తారు.
వివరాలు
22ఏ జాబితాలో భూమి చేర్చే విధానం..
చట్టబద్ధమైన అధికారాలు లేని వ్యక్తులు లేదా అధికారులు చేసిన సిఫార్సుల ఆధారంగా ఎలాంటి భూమినీ 22ఏ జాబితాలో చేర్చరాదు.
భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం లేదా తొలగించడం విషయంలో ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్‌కే అధికారాలు ఉంటాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవో ప్రతిపాదనను డీఆర్వో పరిశీలించి, అనంతరం జాయింట్ కలెక్టర్‌కు నివేదిక పంపాలి.
పట్టణ ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ సమీక్షించి సీసీఎల్‌ఏకు పంపాలి.
గ్రామాల్లో ఒక ఎకరానికి మించి, పట్టణాల్లో వెయ్యి చదరపు గజాలకు మించిన భూమిని 22ఏ జాబితాలో చేర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
ప్రతిపాదించే ప్రతి భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, చేర్చడానికి గల కారణం, వర్తించే క్లాజ్, సంబంధిత డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించాలి.