LOADING...
AP Animal Husbandry: పశు బీమా ప్రీమియం రాయితీ 85 శాతానికి పెంపు .. రెండేళ్లలో పశు సంవర్ధక శాఖ పురోగతి
రెండేళ్లలో పశు సంవర్ధక శాఖ పురోగతి

AP Animal Husbandry: పశు బీమా ప్రీమియం రాయితీ 85 శాతానికి పెంపు .. రెండేళ్లలో పశు సంవర్ధక శాఖ పురోగతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

గత ప్రభుత్వ హయాంలో పశువులు మృతి చెందిన రైతులకు చెల్లించాల్సిన పశుబీమా క్లెయిమ్‌లను పెండింగ్‌లో ఉంచగా, ఐదేళ్లలో పేరుకుపోయిన రూ.110 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో పూర్తిగా చెల్లించినట్లు పశుసంవర్ధక శాఖ వెల్లడించింది. పశుబీమా ప్రీమియంపై అందించే రాయితీని 80 శాతం నుంచి 85 శాతానికి పెంచడంతో పాటు, ఇప్పటివరకు 60 వేల పశువులకు బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి విపత్తుల వల్ల పశువులు చనిపోతే అందించే పరిహారాన్ని గతంలో ఉన్న రూ.37,500 నుంచి రూ.50 వేలకు పెంచడం ద్వారా పశుపోషకులకు ప్రభుత్వం మరింత ఆర్థిక భరోసా కల్పించింది.

వివరాలు 

గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం మొదటి స్థానం

రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తిలో పశుసంవర్ధక రంగం 12.17 శాతం వాటాను నమోదు చేసింది. 2025-26 నాటికి జాతీయ స్థాయిలో గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా,మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానం,పాల ఉత్పత్తిలో ఏడో స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒంగోలు గిత్తలు,పుంగనూరు ఆవులు,నెల్లూరు,మాచర్ల జాతి గొర్రెలు,ఆశిల్ జాతి కోళ్లు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాయని పశుసంవర్ధక శాఖ పేర్కొంది. మేలుజాతి గోవుల సంతతిని పెంపొందించేందుకు ఐవీఎఫ్, పిండ మార్పిడి సాంకేతికతలను అమలు చేస్తూ ఇప్పటివరకు అత్యున్నత జన్యు లక్షణాలు కలిగిన 67 దూడలను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర్ నాయుడు గత రెండేళ్లలో సాధించిన ప్రగతితో పాటు, 2026-27లో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రకటించారు.

వివరాలు 

రెండేళ్లలో చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు..

గొర్రెలు, మేకలకు సంవత్సరానికి నాలుగు సార్లు, పశువులకు రెండుసార్లు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26,512 పశువైద్య శిబిరాలు నిర్వహించి 23 లక్షల పశువులకు నాణ్యమైన వైద్యసేవలు అందించారు. దీని ద్వారా 9.99 లక్షల మంది పశుపోషకులు ప్రత్యక్షంగా లబ్ధి పొందారు. పేద పశుపోషకులకు రాయితీపై 30,313 పశు షెడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు, పశువులు, జీవాలకు తాగునీటి సౌకర్యం కోసం 20,543 నీటి తొట్టెలను నిర్మించారు. రూ.300 విలువైన లింగ నిర్ధారిత వీర్య నాళికలను రూ.150కే అందుబాటులోకి తీసుకొచ్చి, ఇప్పటివరకు 3.30 లక్షల వీర్య నాళికలను పంపిణీ చేశారు.

Advertisement

వివరాలు 

రెండేళ్లలో చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు..

పశు ఉత్పత్తులను నిలకడగా కొనసాగించేందుకు, పశువుల అమ్మకాలను నిరోధించేందుకు 50 శాతం రాయితీపై 1,72,527 మంది పశుపోషకులకు 31,202 టన్నుల సమీకృత దాణాను పంపిణీ చేశారు. 75 శాతం రాయితీపై 6,233 టన్నుల పశుగ్రాస విత్తనాలను 3,11,657 మంది పశుపోషకులకు అందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం రాయితీపై 1,900 గడ్డి కత్తిరించే యంత్రాలను సరఫరా చేశారు. మారుమూల ప్రాంతాల్లోని పశుపోషకులకు ఇంటి వద్దే పశువైద్య సేవలు అందించేందుకు 340 సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలను అందుబాటులో ఉంచారు.

Advertisement

వివరాలు 

2026-27లో చేపట్టనున్న కార్యక్రమాలు

మేలుజాతి పెయ్యదూడల ఉత్పత్తి కోసం రూ.15 కోట్ల రాయితీతో 10 లక్షల లింగ నిర్ధారిత వీర్య నాళికల వినియోగం. కోళ్ల పరిశ్రమలో రెండంకెల వృద్ధి సాధించేందుకు ప్రత్యేక పౌల్ట్రీ పాలసీ అమలు. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పశువైద్య అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీ. రాష్ట్రవ్యాప్తంగా పశువైద్యశాలలకు 777 కొత్త భవనాల నిర్మాణం. పశుసంవర్ధక రంగంలో 15 శాతం వృద్ధిరేటు సాధించి, 2029-30 నాటికి రూ.3 లక్షల కోట్ల జీఎస్‌డీపీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్త పథకాలను మరింత సమర్థంగా అమలు చేయనున్నట్లు శాఖ వెల్లడించింది.

Advertisement